అంతర్జాతీయ విమానాశ్రయంలో పద్మనాభస్వామి ఆరట్టు వేడుక.. 5గంటలు విమానాలు బంద్!!
కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్టోబర్ 23వ తేదీన ఐదు గంటలపాటు విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. తిరువనంతపురంలోని విమానాశ్రయంలో శ్రీ పద్మనాభ స్వామి ఆలయ సాంప్రదాయం అయిన ఆరట్టు ఊరేగింపు రన్ వే గుండా వెళ్లేందుకు వీలుగా ఆరోజు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఈ ఆచారం రాజ కుటుంబంలో దశాబ్దాల నాటి ఆచారానికి అనుగుణంగా చేస్తారని తెలిపారు. తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (TIAL) ఒక ప్రకటనలో, శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో అల్పసి ఆరట్టు ఊరేగింపును సులభతరం చేయడానికి అక్టోబర్ 23 సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

సాయంత్రం నాలుగు గంటల నుండి 9 గంటల వరకు విమాన సేవలను నిలిపివేయడంతో, మళ్లీ విమానాల యొక్క మార్పు చేసిన సమయాలు సంబంధిత విమానయాన సంస్థల వద్ద అందుబాటులో ఉన్నాయని తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేర్కొంది. శతాబ్దాల కాలంనాటి సంప్రదాయమైన ఆరట్టు ఉత్సవ ఊరేగింపు విమానాశ్రయం రన్ వే మీదుగా వెళ్ళవలసిన నేపథ్యంలో, విమానాలను ఆ సమయంలో రద్దుచేసి, మళ్లీ వాటిని రీ షెడ్యూల్ చేస్తున్నట్టుగా పేర్కొంది.
శ్రీ పద్మనాభ స్వామి విగ్రహాల పవిత్ర స్నానం కోసం షంగుముఖం బీచ్‌కు చేరుకోవడానికి ఈ మార్గం గుండా ఆలయ ఊరేగింపు ఆచారం శతాబ్దాల క్రితం ప్రారంభమైందని తెలిపింది. 1932లో విమానాశ్రయం స్థాపించబడిన తర్వాత కూడా ఇది కొనసాగుతోందని, ఈ క్రమంలోనే అక్టోబర్ 23న ఐదు గంటల పాటు స్వామి కోసం విమానాలను నిలిపివేస్తున్నట్లు చెబుతున్నారు.
తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించినప్పుడు, అప్పటి ట్రావెన్‌కోర్ రాజు శ్రీచితిర తిరునాళ్ ఈ విమానాశ్రయ సదుపాయం సంవత్సరంలో 363 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ట్రావెన్కోర్ రాజులు పూజించే పద్మనాభ స్వామికి రెండు రోజులు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. చాలా ఘనంగా ఎంతో వైభవంగా జరిగే ఈ ఆరట్టు వేడుకను చూసేందుకు అక్కడివారు ఉత్సాహం చూపిస్తారు.












Click it and Unblock the Notifications