పాక్ మీడియా అత్యుత్సాహం: ఆ వీడియోలు నకిలీవని భారత ఆర్మీ
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోకి భారత సైన్యం చొచ్చుకెళ్లి పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయని ఇండియన్ ఆర్మీ చేసిన ప్రకటనకు భిన్నంగా పాకిస్థాన్‌కు చెందిన టీవీ ఛానళ్లు భారత జవాన్లు మరణించినట్లుగా చూపిస్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి.
పాక్ వీడియో దృశ్యాలపై ఇండియన్ ఆర్మీ స్పందించింది. ఆ వీడియో దృశ్యాలు మార్ఫింగ్ చేసినవిగా ఇండియన్ ఆర్మీ పేర్కొంది. పాక్ టీవీ ఛానెళ్లు కావాలనే నకిలీ విజువల్స్‌తో వార్తా కథనాలను ప్రసారిస్తున్నాయని ఆర్మీ మండిపడింది. ఈ వీడియోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని పేర్కొంది.
సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా భారత సైనికులు మరణించినట్లు చూపించే వీడియో క్లిప్‌లు గానీ, ఫొటోలు గానీ వచ్చినా వాటిని షేర్ చేయొద్దని, మీడియాలో ప్రసారం కూడా చేయొద్దని ఆర్మీ వర్గాలు సూచించాయి. పీఓకేలో సర్జికల్ దాడుల్లో పాల్గొన్న వారంతా క్షేమంగా తిరిగివచ్చారని పేర్కొంది.

అయితే ఒక జవాన్ మాత్రం మందుపాతరపై కాలు పెట్టడం వల్ల గాయాలు పాలయ్యాడని, ఆ జవాన్‌ని ఢిల్లీలోని ఆర్ఆర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పీఓకేలోని పూంచ్ జిల్లా టట్టాపానీ వద్ద ఉన్న నియంత్రణ రేఖ వద్ద భారత్ పాకిస్థాన్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో ఎనిమిదిమంది భారత సైనికులు, ఇద్దరు పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, ఒక భారతీయ జవాన్‌ను పాక్ దళాలు ప్రాణాలతో పట్టుకున్నాయని డాన్ వెబ్‌సైట్ తొలుత వెల్లడించింది.
కాగా, ఈ వార్తలను పాకిస్థాన్ సైన్యం ధ్రువీకరించలేదు. దీంతో తన కథనాన్ని గురువారం రాత్రి డాన్ పత్రిక తమ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ఇదిలా ఉంటే నియంత్రణ రేఖ లోపలికి చొచ్చుకుపోయి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్ వల్లే 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.












Click it and Unblock the Notifications