• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Pakistan: 75 ఏళ్ల తరువాత పాకిస్తాన్‌లోని తన సొంత ఇంటికి వెళ్లిన భారత మహిళ రీనా వర్మ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రీనా వర్మ

పూణెలో నివసిస్తున్న 90 ఏళ్ల రీనా వర్మ ఎట్టకేలకు పాకిస్తాన్‌లోని తన సొంత ఇంటికి వెళ్లగలిగారు. గత 75 ఏళ్లుగా ఆమె కన్న కల నెరవేరింది.

రావల్పిండిలోని కాలేజీ రోడ్డులో ఉన్న తన ఇంటి వద్ద బుధవారం రీనాకు ఘన స్వాగతం లభించింది. ఆమెపై గులాబీ రేకుల జల్లు కురిసింది. ఆమె రాకను స్వాగతిస్తూ ఆత్మీయులు వేడుక చేసుకున్నారు.

రీనా వర్మ కుటుంబం 1947లో భారత ఉపఖండ విజభనకు కొన్ని వారాల ముందే రావల్పిండి నుంచి తరలివెళ్లింది.

భారత-పాకిస్తాన్ విజభన అల్లకల్లోలం సృష్టించింది. ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో రక్తం ఏరులై పారింది. మతపరమైన అల్లర్లు చెలరేగడంతో లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి సరిహద్దులు దాటారు.

రీనా వర్మ

ఇంత వేదన, బాధ మధ్య కూడా రీనా వర్మ చిన్నప్పుడు తాను నివసించిన ఇంటి గురించి ఆలోచించడం మానలేదు. ఆ ఇంటిని ఆమె తండ్రి కట్టించారు.

2021లో రీనా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన చిన్ననాటి ఇంటి గురించి ప్రస్తావించారు. అక్కడకు మళ్లీ వెళ్లేందుకు ఆమె ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో చెప్పారు. దాంతో భారత, పాకిస్తాన్ సోషల్ మీడియాల్లో ఆమె బాగా పాపులర్ అయ్యారు.

ఇండియా-పాకిస్తాన్ హెరిటేజ్ క్లబ్ అనే ఫేస్‌బుక్ గ్రూపులోని కార్యకర్తలు రావల్పిండిలో ఆమె పూర్వీకుల ఇంటి కోసం వెతకడం ప్రారంభించారు. చివరకు, ఒక మహిళా జర్నలిస్ట్ దానిని కనుగొన్నారు.

అయితే, గత ఏడాది కరోనా నిబంధనల కారణంగా ఆమె పాకిస్తాన్ వెళ్లలేకపోయారు.

పాకిస్తాన్

వీసా రాలేదు..

ఈ ఏడాది మార్చిలో రీనా పాకిస్తాన్ వెళ్లడానికి వీసా కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ, ఎలాంటి కారణాలు చూపకుండా దాన్ని తిరస్కరించారు.

"నా మనసు ముక్కలైపోయింది. 90 ఏళ్ల వృద్ధురాలి దరఖాస్తును తిరస్కరిస్తారని నేనసలు ఊహుంచలేదు. అదీ, చనిపోయే ముందు తన చిన్ననాటి ఇంటిని చూడడం కోసం పెట్టుకున్న దరఖాస్తు. అలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. కానీ, జరిగింది" అని రీనా వర్మ చెప్పారు.

రీనా మళ్లీ దరఖాస్తు పెట్టుకుందామనుకున్నారు. దానికి ముందే ఆమె కథ పాకిస్తాన్ మంత్రి చెవిన పడింది. ఆయన వెంటనే ఆమె దరఖాస్తును ముందుకు తీసుకెళ్లాల్సిందిగా దిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్‌కు ఆదేశాలిచ్చారు.

"పాకిస్తాన్ హైకమిషన్ నుంచి ఫోన్ రాగానే నేను ఆనందం పట్టలేకపోయాను. వచ్చి వీసా తీసుకెళ్లమని పిలిచారు. ఇదంతా కొద్ది రోజుల్లోనే జరిగింది" అని చెప్పారు రీనా.

రీనా వర్మ

అయితే, ఆమెకు వేరే సవాళ్లు ఎదురయ్యాయి. వేసవికాలం మండిపోతోంది. రీనా వర్మ కొడుకు ఈమధ్యే చనిపోయారు. దాంతో, ఆమె ఒంటరిగానే ప్రయాణానికి పూనుకున్నారు. కానీ మండుటెండల్లో వెళ్లడం మంచిది కాదని సన్నిహితులు సూచించారు. కొన్ని నెలలు ఆగి ఎండలు తగ్గాక వెళ్లమని సలహా ఇచ్చారు.

ఆ నిరీక్షణ "వేదనాభరితమని" రీనా చెప్పారు. కానీ, అనారోగ్యం పాలవ్వకూడదని ఆమె ఎండలు తగ్గే వరకు వేచి చూశారు. చివరకు, జూలై 16న పాకిస్తాన్‌లో కాలు పెట్టారు.

జూలై 20న రావల్పిండిలోని తన ఇంటికి చేరుకున్నారు. నేను ఆమెను కలిసినప్పుడు మంచి రంగు రంగుల బట్టలేసుకున్నారు. ఆమె కళ్లు ధగధగ మెరిసిపోతున్నాయి.

'తీపి, చేదు అనుభవాలు రెండూ కలిగాయి'

రీనా తన పాకిస్తాన్ ప్రయాణం గురించి చెబుతూ "తీపి, చేదు అనుభవాలు రెండూ కలిగాయి" అన్నారు.

"ఆ క్షణాన్ని నా కుటుంబంతో పంచుకోవాలనుకున్నాను. కానీ, వాళ్లల్లో ఎవరూ మిగల్లేదు. అందరూ వెళ్లిపోయారు. అక్కడకు వెళ్లినందుకు సంతోషంగా ఉంది. కానీ, ఆ అనుభవం ఒంటరితనాన్నే మిగిల్చింది" అంటూ రీనా విచారం వ్యక్తం చేశారు.

1947 వేసవిలో తమ ఇంటిని విడిచిపెట్టి వస్తున్నప్పుడు, మళ్లీ అక్కడకు వెళ్లగలమని తమ అక్కచెల్లెళ్లు ఎప్పుడూ అనుకోలేదని రీనా చెప్పారు.

"ఒక అక్కకి అమృతసర్‌లో పెళ్లి జరిగింది. 1947 ఏప్రిల్‌లో మా బావగారు మా ఇంటికి వచ్చారు. మమ్మల్ని ఆయనతో పంపించమని మా నాన్నకు చెప్పారు. విభజన అగ్గి రాజుకుంటోందని ఆయనకు తెలుసు. అందుకే, ఆ ఏడాది వేసవిలో మమ్మల్ని ముర్రీ పంపించకుండా భారతదేశంలోని సిమ్లాకు పంపించారు. సాధారణంగా సెలవులకు మేం ముర్రీ వెళుతుంటాం" అంటూ రీనా ఆనాటి పరిస్థితులను వివరించారు. ముర్రీ, రావల్పిండికి 88 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత ప్రాంతం.

రీనా వర్మ ఇల్లు

"మా తల్లిదండ్రులకు సిమ్లా రావడం ఇష్టం లేదు. కానీ, కొన్ని వారాల తరువాత వాళ్లు కూడా బయలుదేరి వచ్చేశారు. మేం క్రమంగా విభజనను అంగీకరించాం. మా అమ్మ మాత్రం ఎప్పటికీ జీర్ణించుకోలేకపోయారు. దీనివల్ల ఏం తేడా వస్తుందో ఆమెకు ఎప్పటికీ అర్థం కాలేదు. 'విభజన వల్ల మనకేం తేడా వస్తుంది’ అని ఆమె ఎప్పుడూ అంటుండేవారు. 'మొదట్లో బ్రిటిష్ పాలన కింద ఉండేవాళ్లం. ఇప్పుడు ముస్లిం పాలన కింద ఉంటాం.. అంతే కదా. మనం ఎందుకు మన ఇల్లు విడిచిపెట్టి వెళ్లాలి?’ అని మా అమ్మ ప్రశ్నించేవారు".

పాకిస్తాన్ విడిచిపెట్టి భారత్ వచ్చిన తరువాత వారికి ఇచ్చిన ఇల్లు రీనా తల్లికి నచ్చలేదు. దాన్ని ఎప్పుడూ ఆమె అంగీకరించలేదు. ఒకవేళ అంగీకరిస్తే, పాకిస్తాన్‌లోని తమ సొంత ఇంటిని ఎప్పటికీ వెనక్కు పొందలేమని ఆమె భావించారు.

రీనా వర్మ

ఇల్లేం మారలేదు

రావల్పిండిలోని రీనా వర్మ ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. కొత్తగా సున్నాలు వేసి, బయట కొంచం మార్చారు కానీ, లోపల అంతా అలాగే ఉంది.

రీనా వర్మ అక్కడకు వెళ్లగానే రిపోర్టర్లు గుమికూడారు. కానీ, వారిని ఇంటి లోపలకు రానివ్వలేదు. అలాగే, కొత్తగా వచ్చిన అతిధిని చూసేందుకు చుట్టుపక్కల జనం కూడా పోగయ్యారు. ఆమెతో సెల్ఫీ తీసుకోవాలని ముచ్చటపడ్డారు.

ఇంటి లోపల కొంత సమయం గడిపి బయటకు వచ్చారు రీనా. వెంటనే డజను కెమేరాలు క్లిక్కుమనిపించాయి.

ఉక్కపోతగా ఉన్నా, చుట్టూ జనం మూగినా రీనా వర్మ తత్తరపడలేదు. ఆమె రిపోర్టర్లతో ప్రశాంతంగా మాట్లాడారు. ఇల్లు చాలావరకు అలాగే ఉందని, గచ్చులు, పైకప్పు ఏమీ మారలేదని చెప్పారు. ఆ ఇల్లు ఒకప్పటి అందమైన జ్ఞాపకాలను తట్టి లేపిందని, తన బంధుమిత్రులందరూ గుర్తొచ్చారని చెప్పారు.

రీనా వర్మ

"నా హృదయం దుఃఖిస్తోంది. కానీ, నేను జీవితకాలం ఎదురు చూసిన క్షణం నా ముందుంది. అందుకు కృతజ్ఞురాలిని" అని రీనా చెప్పారు.

రీనా కథ భారత, పాకిస్తాన్ మధ్య సంబంధాలలో ఆసలు చిగురింపజేసిందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Pakistan: Indian woman Reena Verma who went to her own home in Pakistan after 75 years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X