పాకిస్తాన్ ఆటోలో ప్రధాని మోడీ ప్రయాణం?- అసలు వాస్తవం ఇదే..!
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) అక్కడ వివిధ దేశాధినేతలతో బిజీగా కనిపించారు. అయితే మధ్యలో ప్రధాని మోడీ.. ఆటోలో ఓ విదేశీ నేతతో కలిసి ప్రయాణించారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ముఖ్యంగా పాకిస్తాన్ కు చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నాయి. తమ దేశంలో తయారైన ఆటోలో భారత ప్రధాని మోడీ ప్రయాణించారంటూ అవి ప్రచారం చేసుకుంటున్నాయి.
ఫిలిప్పీన్స్ జీప్నీల నుండి ప్రేరణ పొందిన కళాకృతులను కలిగి ఉన్న ఈ రంగురంగుల వాహనాలను, ఆసియాన్ సదస్సులో భాగంగా ఆతిథ్య దేశం ఏర్పాటు చేసింది. ఇటువంటి నైరూప్య కళాకృతులు ఫిలిప్పీన్స్‌లోని ప్రజా రవాణా వాహనాలపై కనిపిస్తాయి. విందు కోసం వచ్చినప్పుడు ప్రధాని మోడీ.. బరోంగ్ టాగలోగ్ అని పిలువబడే సాంప్రదాయ ఫిలిప్పీన్స్ దుస్తులను ధరించి కనిపించారు. ఆ దుస్తులపై క్లిష్టమైన టోనల్ ఎంబ్రాయిడరీతో పాటు విస్తృతమైన పూల నమూనాలు ఉన్నాయి. అలాగే ఆయన ప్రయాణించిన ఆటో చర్చనీయాంశం కావడంతో ఫ్యాక్ట్ చెకర్స్ రంగంలోకి దిగారు.

ఆసియాన్ సదస్సులో మోదీ 'మేడ్-ఇన్-పాకిస్తాన్' ఇ-రిక్షాలో ప్రయాణించారంటూ లాహోర్‌కు చెందిన జర్నలిస్ట్ హమ్మద్ హసన్ చేసిన ట్వీట్ వెనుక వాస్తవాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో ఈ వాదన ఫేక్ అని తేలింది. ప్రధాని మోడీ ప్రయాణించిన ఆటోను తయారు చేసింది బజాజ్ సంస్థ అని తేలింది. అయితే బజాజ్ ఆటోలో మోడీ ప్రయాణిస్తే పాకిస్తాన్ తమ ఆటోగా దాన్ని ఎందుకు చెప్పుకుందన్న ప్రశ్నలు తలెత్తాయి. వీటిపై ఆరా తీస్తే...ఈ వాదనలన్నీ ఒకే విషయంపై ఆధారపడి ఉన్నట్లు కనిపించాయి. అది త్రీ-వీలర్లను తయారు చేసే పాకిస్తానీ ఆటో సంస్థ సజ్గర్.. గత నెలలో ఫిలిప్పీన్స్‌లోని లగునాలో తన మొదటి విదేశీ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆగ్నేయాసియాలోకి విస్తరించాలనే సంస్థ ప్రణాళికలలో ఇది ఒక భాగం. అయితే ఆసియాన్ సదస్సులో ప్రపంచ నాయకులను తరలించడానికి ఉపయోగించిన త్రీ-వీలర్లను భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ తయారు చేసింది. మార్పులు చేసిన ఆటోల క్లోజప్ వీడియోలలో వాటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లపై బజాజ్ లోగో స్పష్టంగా కనిపించింది. అయినా ఇవి తమ ఆటోలుగా చెప్పుకోవడం ద్వారా పాకిస్తాన్ మరోసారి ఫేక్ ప్రచారం చేసుకుంటున్నట్లు అర్దమవుతోంది.














Click it and Unblock the Notifications
