శశికళకు షాకు మీద షాక్: పార్టీ నిధులపై బ్యాంకుకు పన్నీరుసెల్వం లేఖ
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం షాకుల మీద షాక్‌లు ఇస్తున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం షాకుల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే శశికళ క్షమాపణలు కోరుతూ జయలలితకు రాసిన లేఖను బయటపెట్టి షాకిచ్చిన ఆయన.. తాజాగా మరో షాకిచ్చారు. అదేమంటే.. అన్నాడీఎంకే పార్టీ నిధుల ఖాతాను కోశాధికారి అయిన తన అనుమతి లేకుండా వాడొద్ద(విడుదల చేయొద్ద)ని బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరారు.
ఈ మేరకు బ్యాంకు చీఫ్ మేనేజర్‌కు లేఖ రాశారు. పార్టీ నిబంధన(రూల్.20 సబ్ క్లాజ్ 5)ల ప్రకారం ప్రధాన కార్యదర్శి ఎన్నికయ్యే వరకూ ఖాతాలను తన ఆధీనంలో ఉంచుకునే హక్కు ఉందని, తాను చెప్పే వరకు ఖాతాలను వాడరాదని తెలిపారు.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత నిబంధన 20, సబ్ క్లాజ్ 2 ప్రకారం ప్రధాన కార్యదర్శి ఎన్నిక కాలేదని వివరించారు. అందువల్ల ఖాతాలపై పూర్తి అధికారాలు తనకే ఉంటాయన్నారు. ఇదిలా ఉండగా, తిరుగుబాటు చేశాడని పన్నీర్‌సెల్వంను పార్టీ పదవి నుంచి తొలగిస్తూ శశికళ వేటేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సీఎం పదవి కోసం శశికళ, పన్నీరుల మధ్య ఉత్కంఠ పోరు నడుస్తోంది. గవర్నర్ వద్ద బలనిరూపణకు ఇద్దరూ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications