పార్లమెంట్లో విపక్షాలపై కేంద్రం కన్నెర్ర- మరో ముగ్గురు ఎంపీల సస్పెన్షన్- మొత్తం 27కు చేరిక
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్ని నిర్వహించడంలో కేంద్రం తీవ్రంగా విఫలమవుతోంది. ఉభయసభల్లోనూ మెజారిటీ ఎంపీల్ని కలిగిన అధికార బీజేపీ.. విపక్షాల ప్రశ్నలకు జవాబు చెప్పలేక తడబడుతోంది. దీంతో విపక్షాలు తమ నిరసనల్ని ముమ్మరం చేశాయి. ధరలపెరుగుదల, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధింపు వంటి నిర్ణయాలపై ఆందోళనలకు దిగుతున్న విపక్ష ఎంపీల్ని కేంద్రం వరుసగా సస్పెండ్ చేస్తూ పోతోంది.
ఇప్పటికే లోక్ సభలో నిరసనలకు దిగుతున్న నలుగురు ఎంపీల్ని సస్పెండ్ చేసిన కేంద్రం.. రాజ్యసభలో అయితే మరింత దారుణంగా వ్యవహరిస్తోంది. విపక్షాలు కోరిన ఏ చర్చనూ అనుమతించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కేంద్రం.. సభా కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నారనే కారణంతో విపక్ష ఎంపీల్ని సస్పెండ్ చేస్తూ వెళుతోంది. ఇప్పటికే వర్షాకాల సమావేశాల్లో ఉభయసభల్లో కలిపి 24 మంది ఎంపీల్ని సస్పెండ్ చేసిన కేంద్రం.. ఇవాళ మరో ముగ్గురు ఎంపీల్ని సస్పెండ్ చేసింది. ఇవాళ రాజ్యసభలో సస్పెండైన వారిలో ఇద్దరు ఆప్ ఎంపీలతో పాటు ఓ స్వతంత్ర ఎంపీ కూడా ఉన్నారు. దీంతో ఈ వర్షాకాల సమావేశాల్లో సస్పెండైన ఎంపీల సంఖ్య 27కు చేరింది.

ఇవాళ సస్పెండైన ముగ్గురు ఎంపీల్లో ఆప్‌కి చెందిన సుశీల్ కుమార్ గుప్తా, సంజీవ్ కుమార్ పాఠక్ తో పాటు స్వతంత్ర ఎంపీ అజిత్ కుమార్ భుయాన్ కూడా ఉన్నారు. రాజ్య సభలో ప్లకార్డులు పట్టుకున్నందుకు రాజ్యసభ నుండి వీరు సస్పెండ్ అయ్యారు. గుజరాత్ లో కల్తీమద్యం దుర్ఘటనపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన మొత్తం ఎంపీల సంఖ్య ఇప్పుడు 23కి చేరుకుంది. లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీలు కూడా ఇంతకుముందు సస్పెండ్ అయ్యారు.
పార్లమెంటులో ద్రవ్యోల్బణం, జిఎస్‌టి పెంపుపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల వరుస నిరసనలతో వర్షాకాల సమావేశాల తొమ్మిదో రోజు కూడా లోక్‌సభ, రాజ్యసభలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. 20 మంది ఎంపీల సస్పెన్షన్‌ను కూడా రద్దు చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన 20 మంది ఎంపీలు ప్రస్తుతం గాంధీ విగ్రహం సమీపంలోని పార్లమెంట్ కాంప్లెక్స్‌లో 50 గంటలపాటు నిరసన దీక్ష చేస్తున్నారు. ఇవాళ మరికొందరు ఎంపీలు సస్పెండ్ కావడంతో విపక్షాల నిరసనలు మరింత తీవ్రమవుతున్నాయి. విపక్షాల నిరసనలతో ఇవాళ ఉదయం ఉభయసభల్లోనూ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఇరుసభలూ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.












Click it and Unblock the Notifications