వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పటేళ్ల ‘చే’యూత ఎటువైపు: కాంగ్రెస్‌ను ఎత్తుకుంటారా? కమలానికి కష్టకాలమేనా?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: ఎన్నికల నగారా మోగిన గుజరాత్‌లో ఇటీవల సంఘటిత శక్తిగా ఎదిగిన పటేళ్లపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు దృష్టి సారించాయి. రాజకీయాల్లో, వ్యాపారాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్న పటేళ్లు.. తమకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఓబీసీ రిజర్వేషన్‌ కావాలని గత రెండేళ్లుగా పెద్దఎత్తున ఉద్యమించడం ద్వారా అన్ని వర్గాల దృష్టిని ఆకర్షించారు. పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్‌ పటేల్‌.. అధికార బీజేపీ నేతలకు కంటిలో నలుసుగా మారారు. పటేళ్లను సంఘటిత శక్తిగా నిలిపిన హార్దిక్ పటేల్ శక్తి, సామర్థ్యాలను అంచనా వేయడంలో తొలి దశలో విఫలమైన బీజేపీ సర్కార్.. ఆయన్ను రాష్ట్రం నుంచి ఆరు నెలల పాటు బహిష్కరించడం పాటిదార్లలో అధికార పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచి పోషించింది.

Recommended Video

Gujarat Assembly elections on December 9 and 14 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ | Oneindia Telugu

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చినా కొద్దీ బీజేపీ హార్దిక్ కదలికలపైనే ద్రుష్టి సారించింది. మరోపక్క హార్ధిక్‌ పటేల్‌ రెండు రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని ఒక హోటల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంథీని రహస్యంగా కలిసినట్లు ప్రచారం అవుతోంది. పోలీసుల సాయంతో రాహుల్ బస చేసిన హోటల్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ఫుటేజీలను మీడియాకు విడుదల చేయాల్సిన అవసరమేమిటన్న సందేహాలు ఉన్నాయి. అసలు ఈ పటేళ్లు ఎవరు? వారికి ఎందుకింత ప్రాధాన్యం? వారంతా ఒకే రాజకీయ పార్టీకి అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయా? అనే అంశాలపై ఒక పరిశీలన..

 పటేళ్లలో పెరిగిపోయిన ఆర్థిక అసమానతలు

పటేళ్లలో పెరిగిపోయిన ఆర్థిక అసమానతలు

పటేల్‌, పటిదార్‌, కన్బి - పటేల్‌, కద్వా పటియార్‌..అందరూ ఒకటే. వీరిని కుర్మి క్షత్రియులని కూడా అంటారు. మనదేశంలో మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పటేళ్లు ఉన్నారు. కానీ గుజరాత్‌ వారి సొంత రాష్ట్రం అని చెప్పవచ్చు. దాదాపు 6.5 కోట్ల గుజరాత్‌ జనాభాలో 20 శాతం పటేళ్లు ఉంటారని అంచనా. వారి ప్రధాన వ్యాపకం వ్యవసాయం, వ్యాపారం. ఏ పనిని ఎంచుకున్నా కష్టించి పనిచేయటమే వారి ఎదుగుదలకు వీలు కల్పించింది. రాజకీయంగా ఎందరో ప్రముఖులు ఈ సామాజికవర్గంలో ఉన్నారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. మనదేశంలోనే కాక అమెరికాలో, బ్రిటన్‌లో, కొన్ని ఆఫ్రికా దేశాల్లోని భారతీయ వ్యాపారుల్లో పటేళ్లే అధికం. కానీ కొన్నేళ్లుగా పటేళ్లలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే పటేళ్లు అభివృద్ధి ఫలాలను అందుకోలేక వెనుకబడిపోవడం వారిలో అసంతృప్తికి కారణమైంది. తమకూ ఓబీసీ రిజర్వేషన్లు కావాలనే పటేళ్ల నుంచి డిమాండ్‌ రావటానికి ఇదే కారణం.

పటేళ్ల ఆందోళనపై బీజేపీ ఇలా.. కాంగ్రెస్ అలా

పటేళ్ల ఆందోళనపై బీజేపీ ఇలా.. కాంగ్రెస్ అలా

తమకు ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని 2015 జులై నుంచి పటేళ్లు ఆందోళన బాట పట్టారు. అనతికాలంలోనే ఈ రిజర్వేషన్ల ఉద్యమం గుజరాత్‌ అంతా విస్తరించింది. పలు ప్రాంతాల్లో ధర్నాలు, ప్రదర్శనలు జరిగాయి. యువకుడైన హార్ధిక్‌ పటేల్‌ సారధ్యంలోని పటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పాస్‌) ఈ ఆందోళనకు నేతృత్వం వహించింది. ఈ డిమాండ్‌పై గుజరాత్‌ ప్రభుత్వం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రాజ్యాంగ పరిమితుల కారణంగా పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తర్వాత మూడు నెలలకు కాంగ్రెస్‌ పార్టీ, పాటిదార్ల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. అక్టోబర్‌లో హార్ధిక్‌ పటేల్‌, మరికొందరు నాయకులు అరెస్టు అయ్యారు. ఆ ఏడాది నవంబర్‌లో గుజరాత్‌లో జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను తిరస్కరించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులను ఎన్నుకోవాలని పలువురు పటేల్‌ నాయకులు పిలుపు ఇచ్చారు.

 పటేళ్ల రిజర్వేషన్ డిమాండ్‌పై ఓబీసీల్లో టెన్షన్

పటేళ్ల రిజర్వేషన్ డిమాండ్‌పై ఓబీసీల్లో టెన్షన్

గుజరాత్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పటేళ్ల ఆందోళన మళ్లీ తెరమీదకు వచ్చింది. బీజేపీ మీద కోపంతో కాంగ్రెస్‌ పార్టీకి హార్ధిక్‌ పటేల్‌ నేతృత్వంలో పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి మద్దతు ప్రకటిస్తుందనే అభిప్రాయం ఉంది. అందువల్ల హార్ధిక్‌ పటేల్‌ అనుచరులు కొందరిని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ రిజర్వేషన్ల డిమాండ్‌పై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ పార్టీ స్పందించటం లేదు. ఆ రాష్ట్రంలో ఓబీసీలకు 35 శాతం రిజర్వేషన్‌ ఉంది. అగ్రకులస్థులైన పటేళ్లకు రిజర్వేషన్లు ఇస్తే తమకు నష్టం జరుగుతుందని ఓబీసీలు భావిస్తున్నారు. తాము ఏ రాజకీయ పార్టీతోనూ ఉండమని, రిజర్వేషన్ల సాధనే తమ లక్ష్యమని హార్ధిక్‌ పటేల్‌ ఇప్పటికీ చెబుతూ వచ్చారు. అదే విధానాన్ని కొనసాగిస్తారా? లేక ఏదో రాజకీయ పార్టీతో జతకడతారా? అనేది ప్రశ్నార్ధకంగా ఉంది.

 మద్దతుపై పటేళ్లలో ఇలా భిన్నాభిప్రాయాలు

మద్దతుపై పటేళ్లలో ఇలా భిన్నాభిప్రాయాలు

182 అసెంబ్లీ సీట్లు గుజరాత్‌‌లో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 116 సీట్లు, కాంగ్రెస్‌ పార్టీ 60 సీట్లు గెలుచుకున్నాయి. 1990 వరకూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉంది. ఆ ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్‌ 70 సీట్లు, బీజేపీ 67 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. 1998 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవగా కేశూభాయ్‌ పటేల్‌ తొలిసారి సీఎంగా ఎన్నికయ్యారు. మధ్యలో 1996 అక్టోబర్ 23 నుంచి 1997 అక్టోబర్ 27వ తేదీ వరకు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నేత శంకర్ సింఘ్ వాఘేలా సీఎంగా పని చేశారు. 2001లో నరేంద్ర మోదీకి అవకాశం దక్కింది. 2014 మేలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే వరకు నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎంగా వ్యవహరించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న అంశంపై పటేళ్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2002 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 48 శాతం, కాంగ్రెస్ పార్టీకి 38 నుంచి 39 శాతం ఓట్లు నికరంగా పడుతుండటం గమనార్హం.

 సంపన్నులు మరింత పైపైకి.. దిగజారిన పేదల పరిస్థితి

సంపన్నులు మరింత పైపైకి.. దిగజారిన పేదల పరిస్థితి

భారత మానవ అభివృద్ధి సర్వే ప్రకారం పటేళ్ల వార్షిక తలసరి ఆదాయం 2004-05లో రూ.17,470 కాగా, 2011-12 నాటికి అది రూ.51,045 కు పెరిగింది. తద్వారా గుజరాత్‌లో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న సామాజిక వర్గంగా పటేళ్లకు గుర్తింపు లభించింది. కానీ తలసరి ఆదాయం పెరుగుదల పటేళ్లు అందరికీ మేలు చేయలేదు. ఈ అభివృద్ధి ఫలాలు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న 40 శాతం మంది పటేళ్లకు అందలేదు. రోజు కూలీలుగా ఉన్న ఎనిమిది శాతం మంది పటేళ్ల జీవితాల్లోనూ ఎటువంటి మార్పు రాలేదు. కేవలం వ్యాపారం చేస్తున్న 19 శాతం మంది, జీతభత్యాలు పొందుతున్న మరో 19 శాతం మంది పటేళ్లు మాత్రమే గత ఏడేళ్లలో సంపన్నులుగా మారినట్లు ఈ సర్వే చెబుతోంది. తద్వారా పటేళ్లు అందరూ సంపన్నులు, ఎగువ మధ్యతరగతి ప్రజలు కాదన్నది స్పష్టమవుతోంది. ధనిక పటేళ్లు అత్యంత ధనికులు కాగా పేద పటేళ్లు ఇంకా నిరుపేదలుగా మారిపోవడమే వారిలో అసంతృప్తికి కారణమవుతోంది. ఇంతకంటే పటేళ్లకు ఆందోళన కలిగిస్తున్న విషయం మరొకటి ఉంది. రాష్ట్రంలోని కోలీలు, ఎస్టీల్లోని కొందరు ఆర్థికంగా పటేళ్ల కంటే బలంగా తయారవుతున్నారు. పటేళ్ల కంటే గత కొన్నేళ్లలో కోలీల సగటు ఆదాయం బాగా పెరిగింది. అదేవిధంగా ఎస్టీ కులాల్లో 2011-12 గణాంకాల ప్రకారం 57.8 శాతం మంది అధిక ఆదాయవర్గాలుగా ఉన్నాయి.

English summary
In a dramatic turn of events in the poll bound Gujarat, BJP‘s confidence who has been ruling the state for 22 years, seems to be in muddy waters. Some time back, with Prime Minister Narendra Modi, being the national face of BJP, the party was quite confident about continuing its reign in Gujarat. However, the recent events are depicting a different story and maybe a totally different result. Congress Vice-President Rahul Gandhi has been seriously participating in the election campaign in Gujarat and is personally monitoring the course of action. BJP under the leadership of Vijay Rupani has recently been fearing anti-incumbency in the state, especially from the Partidars, OBC’s, Dalits and the Tribals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X