People Pulse Delhi Exit Polls.. బీజేపీ భారీ విజయం, ఎన్ని సీట్లంటే?
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పలు మీడియా, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను గమనిస్తుంటే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు తెలుస్తోంది. మెజార్టీ పోల్స్ మాత్రం ఈసారి భారతీయ జనతా పార్టీ దేశ రాజధానిలో జెండా ఎగురవేస్తుందని చెబుతున్నారు.
పీపుల్స్ పల్స్ ఎగ్జిపోల్ అంచనాల ప్రకారం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో బీజేపీ 51-60 స్థానాలు దక్కించుకుంటుందని వెల్లడించింది. ఇక అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం 10-19 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. మరోవైపు, పీపుల్స్ పల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాదని తేల్చింది. దీంతో ఈ సర్వే అనుసరించి బీజేపీ ఢిల్లీలో భారీ విజయాన్ని నమోదు చేస్తుందని అంచనా వేయవచ్చు. అసలైన ఫలితాల కోసం మాత్రం మరో మూడు రోజులు వేచిచూడక తప్పదు.

కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపదిముర్ము రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఓటు వేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, విశ్రాంత సీజేఐ డీవై చంద్రచూడ్, కేంద్రమంత్రులు జైశంకర్, హర్ దీప్‌సింగ్‌పూరీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ తన భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడితో కలిసి వెళ్లి ఓటువేశారు.
మాజీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతిశీ, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్, మాజీమంత్రి సత్యేంద్రజైన్ తన సతీమణితో కలిసి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. మయూర్‌విహార్‌లో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తన సతీమణితో కలిసి ఓటువేశారు. కాగా, 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 62.59శాతం ఓట్లు పోలయ్యాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 56శాతం ఓటింగ్ నమోదైంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీగా ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications