డస్ట్‌బిన్లు లేవు.. చెత్త లేదు.. ఇదే దేశంలో క్లీనెస్ట్ విలేజ్!
ఆ గ్రామంలో ఒక్క చెత్తడబ్బా కూడా ఉండదు.. కానీ ఇండియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామాలలో ఒకటిగా నిలిచి సరికొత్త విజయగాథను లిఖించింది. అదే తూర్పు సిక్కింలో సముద్ర మట్టానికి దాదాపు 8 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న 'ఫడన్‌చేన్' అనే ఓ చిన్న హిమాలయ గ్రామం. ఈ గ్రామం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. పురాతన సిల్క్ రూట్ మార్గంలో ఉన్న ఈ 'ఫడన్‌చేన్' గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జులుక్ వైపు వెళ్లే పర్యాటకులకు ఇది ఓ ప్రధాన విడిది కేంద్రం. సాధారణంగా పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరిగే కొద్దీ రోడ్ల పక్కన ప్లాస్టిక్ సీసాలు, వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. కానీ ఈ గ్రామంలో వీధుల పొడవునా ఎక్కడా బహిరంగ చెత్తడబ్బాలు కనిపించవు. అయినప్పటికీ వీధులు అద్దంలా మెరిసిపోతుంటాయి. చెత్తను రోడ్డుపై పడేసే అలవాటును ప్రజల్లో పూర్తిగా మాన్పించడమే దీనికి ప్రధాన కారణం.
ఈ గొప్ప మార్పు వెనుక 17 మంది స్థానిక మహిళల నిబద్ధత, కఠిన శ్రమ దాగి ఉన్నాయి. 2017లో నాటి పంచాయతీ అధ్యక్షురాలు దావా చోడెన్ భుటియా నాయకత్వంలో 'స్వచ్ఛత సహయోగి' పేరిట 17 మంది మహిళలతో ఓ ప్రత్యేక బృందం ఏర్పడింది. పర్యాటకుల రాకతో గ్రామంలో పెరిగిపోతున్న వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ మహిళలు రంగంలోకి దిగారు. భుటియా పంచాయతీ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ.. నేటికీ ఈ వ్యర్థాల నిర్వహణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ మహిళలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.

ఈ గ్రామంలో అనుసరిస్తున్న వ్యర్థాల నిర్వహణ విధానం అత్యంత పటిష్టమైనది. ఈ గ్రామంలో చెత్తను రోడ్డు పక్కన పడేశాక శుభ్రం చేయడమే కాకుండా ఉత్పత్తయ్యే ప్రదేశంలోనే అంటే ఇళ్ల వద్దనే తడి, పొడి చెత్తగా వేరుచేస్తారు. తడిచెత్తను వర్మీ కంపోస్టింగ్ ద్వారా సేంద్రీయ ఎరువుగా మారుస్తుండగా.. ప్లాస్టిక్, పొడి చెత్తను రికవరీ ఫెసిలిటీకి పంపి రీసైక్లింగ్ లేదా రీయూజ్ అయ్యేలా చేస్తున్నారు. స్థానిక హోటల్స్, హోంస్టేలు, దుకాణాల నిర్వాహకులకు కూడా ఈ చెత్త నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు, సేకరించిన ప్లాస్టిక్ ను వేరు చేసి బుట్టలు, బ్యాగులు వంటి ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తున్నారు. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో చెత్త వాహనానికి డ్రైవర్ లేకపోతే భుటియా స్వయంగా చెత్త ట్రక్కును నడుపుతూ వ్యర్థాలను సేకరించడం ఇక్కడి నిబద్ధతకు అద్ధం పడుతోంది.
'ఫడన్‌చేన్' గ్రామం పంగోలాఖా వన్యప్రాణాల అభయారణ్యానికి అతిసమీపంలో ఉండటం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు అడవులు, జంతువులకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(WWF-India) 2022లో 'ఫడన్‌చేన్' గ్రామంలోని వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలను పర్యావరణ పరిరక్షణతో ముడిపెట్టి భాగస్వామ్యమైంది.
వీరి అసాధారణ గ్రామ సేవలను గుర్తించిన సిక్కిం ప్రభుత్వం 2023లో లింగ్తమ్- ఫడన్‌చేన్ గ్రామానికి 'క్లీనెస్ట్ విలేజ్' అవార్డుతో పాటు రూ.5 లక్షల నగదు బహుమతిని అందజేసింది. దీనికి తోడు స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ్) కింద ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణానికి ప్రభుత్వం మరో రూ.16 లక్షల నిధులను మంజూరు చేసింది. వీది వీధికి చెత్తడబ్బాలు పెట్టడం ద్వారా కాకుండా రోడ్డుపైకి చెత్త రాకుండా మూలాల్లోనే అడ్డుకోవడం ద్వారా ఈ హిమాలయ గ్రామం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది.














Click it and Unblock the Notifications
