ఎన్నికల సంఘానికి మరో షాక్- తాజా విభేదాల వేళ సుప్రీంకోర్టులో కీలక పిల్..!
కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలపై తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మరోసారి ఈసీపై సుప్రీంకోర్టులో (Supreme Court) ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఎన్నికల సంఘం పనితీరుపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎన్నికల సంఘం పనితీరులో బయయపడుతున్న సంస్థాగత లోపాలను పరిశీలించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో ఆయన కోరారు.
కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు వివేక్ జోషీ, సుఖ్ బీర్ సింగ్ సంధూ ..ఈసీలో విధుల కేటాయింపు విషయంలో డిప్యూటీ కమిషనర్ మనీష్ గార్గ్ పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా, దాన్ని తిరిగి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కే పంపిన వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై మీడియాలో విస్తృతంగా కథనాలు కూడా వచ్చాయి. అయితే కేంద్రం మాత్రం దీనిపై మౌనం వహిస్తోంది. అలాగే ఈసీ కూడా స్పందించలేదు. మరోవైపు ఢిల్లీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీఐ పని తీరుపై స్వతంత్ర విచారణ కోసం పిల్ దాఖలు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు ఇదే పిల్ లో ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు మతపరమైన గుర్తింపులు, మత చిహ్నాలను ఉపయోగించకుండా, మతం ఆధారంగా ఓట్లు కోరడం, మతపరమైన విద్వేష ప్రసంగాలు చేయడం, మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా ప్రచారం నిర్వహించడాన్ని నిషేధించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కూడా పిటిషనర్ కోరారు.
ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకతను బలోపేతం చేయడంతో పాటు, ఎన్నికల ప్రచారంలో మతపరమైన అంశాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషన్‌లో న్యాయవాది విశాల్ తివారీ కోరారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది.













Click it and Unblock the Notifications
