కేంద్ర కేబినెట్లో కీలక మార్పు- న్యాయమంత్రిగా రిజిజు స్ధానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్..
కేంద్ర కేబినెట్లో ప్రధాని మోడీ కీలక మార్పులు చేశారు. న్యాయవ్యవస్ధతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజును ఆ పదవి నుంచి తప్పించారు. ఆయన స్ధానంలో వివాద రహితుడిగా పేరున్న అర్జున్ రామ్ మేఘ్ వాల్ ను నియమించారు. కిరణ్ రిజిజుకు భూగర్భ శాస్త మంత్రిత్వశాఖను అప్పగించారు. దీంతో ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు.
ప్రధాన మంత్రి సలహా మేరకు కేంద్ర కేబినెట్లోని శాఖల్లో మార్పులు చేస్తున్నట్లు రాష్ట్రపతి నుంచి ఓ ప్రకటన వెలువడింది. దీని ప్రకారం భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ పోర్ట్‌ఫోలియోను కిరణ్ రిజిజుకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే అర్జున్ రామ్ మేఘ్‌వాల్.. కిరణ్ రిజిజు స్థానంలో ఆయన ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలతో పాటు న్యాయ మంత్రిత్వ శాఖలో స్వతంత్ర బాధ్యతలను కేటాయించారని తెలిపారు.

కొంతకాలంగా న్యాయమంత్రి కిరణ్ రిజిజు న్యాయవ్యవస్ధపై ప్రత్యక్ష యుద్ధానికి తెరదీశారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై కార్యనిర్వాహ, న్యాయవ్యవస్థ మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. కొలీజియం వ్యవస్థ అనేక సందర్భాల్లో న్యాయమూర్తులను నియమించిందని, ఇది కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం ఫలితమని రిజిజు చేసిన విమర్శలు కాక పుట్టించాయి. అలాగే కొలీజియం వ్యవస్ధ వద్దని, ఇది న్యాయమూర్తులు పక్షపాతంతో నిర్ణయాలు తీసుకునేందుకు పనికొస్తుందని రిజిజు పలు సందర్భాల్లో విమర్శలు చేశారు.

కిరణ్ రిజిజు న్యాయమంత్రి స్ధానంలో ఉంటూ న్యాయవ్యవస్ధపై తరచూ చేస్తున్న రాజకీయ విమర్శలు ఆయన వ్యక్తిగతమా లేక కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ దీని వెనుక ఉన్నారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. అయితే కిరణ్ రిజిజు విమర్శల్ని న్యాయవ్యవస్ధ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ముంబై లాయర్ల అసోసియేషన్ తాజాగా సుప్రీంకోర్టు వరకూ వెళ్లి రిజిజుపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్కడ్ తో పాటు రిజిజుపైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలైనా సుప్రీంకోర్టు దీన్ని సున్నితంగా తిరస్కరించింది.












Click it and Unblock the Notifications