బెంగళూరు.. సింబల్ ఆఫ్ న్యూ ఇండియా
సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా వెలుగొందుతున్న బెంగళూరులో మూడో దశ మెట్రో రైల్ నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణ వ్యయం 15,610 కోట్ల రూపాయలు. నేడు ఆయన బెంగళూరులో పర్యటించారు. ఉదయం మూడు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు, మెట్రో ఎల్లో లైన్ ను ప్రారంభించారు. అనంతరం మూడోదశ మెట్రో రైల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. బెంగళూరు.. దేశ రక్షణ సాంకేతికత, 'మేక్ ఇన్ ఇండియా' మిషన్‌లో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

ఐటీకే కాకుండా ఉన్నత స్థాయి రక్షణ ఉత్పత్తులకు కూడా ప్రధాన కేంద్రంగా మారుతోందని, సాంకేతిక రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్' దార్శనికతను ముందుండి నడిపిస్తోందని చెప్పారు. సరికొత్త భారత్ కు కేంద్ర బిందువుగా బెంగళూరు ఎదుగుతోందని మోదీ పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ విజయంలో బెంగళూరు కీలకంగా మారిందని ప్రధాని అన్నారు. ఇక్కడ తయారైన రక్షణ ఉత్పత్తులను ఈ ఆపరేషన్ లో విరివిగా వినియోగించామని పేర్కొన్నారు. 11 సంవత్సరాలలో దేశం ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి మొదటి 5 ఆర్థిక వ్యవస్థలలోకి ఎదిగిందని, త్వరలో మొదటి 3 ఆర్థిక వ్యవస్థలలోకి చేరుకోవడానికి వేగంగా పురోగమిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ వృద్ధికి నిరంతర సంస్కరణలే కారణమని మోదీ గుర్తు చేశారు. 2014లో అయిదు నగరాలకు మాత్రమే పరిమితమైన మెట్రో రైల్ నెట్‌వర్క్‌లు ఇప్పుడు 24 నగరాలకు విస్తరించాయని, 1,000 కిలోమీటర్లకు పైగా మెట్రో మార్గాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ అని ఆయన తెలిపారు.
రైల్వే విద్యుదీకరణ, విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, జాతీయ జలమార్గాల విస్తరణలో సాధించిన విజయాలను కూడా ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. విద్యుదీకరించిన రైలు మార్గాలు రెట్టింపు అయ్యాయని, విమానాశ్రయాలు 74 నుండి 160కి పైగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ జలమార్గాల సంఖ్య 3 నుండి 30కి పెరిగిందని వివరించారు.
విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల రంగంలో ఎంతగానో పురోగమించామని ప్రధాని తెలిపారు. ఎయిమ్స్ సంస్థల సంఖ్య 7 నుండి 22, వైద్య కళాశాలలు 387 నుండి 704కి పెరిగాయని అన్నారు. లక్ష కొత్త వైద్య సీట్లను అందుబాటులోకి తీసుకుని రావడం ద్వారా మధ్యతరగతి యువతకు ఎంతో లబ్ధి చేకూరిందని ఆయన తెలిపారు.
డిజిటల్ చెల్లింపులు ఎన్నో రెట్లు పెరిగాయని మోదీ పేర్కొన్నారు. 2,200కు పైగా ప్రభుత్వ సేవలు ఇప్పుడు మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉమంగ్ యాప్, డిజిలాకర్ వంటి కార్యక్రమాలు పౌరులకు ప్రభుత్వ సేవలను సులభతరం చేశాయని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications