మంత్రులతో ప్రధాని మోడీ కీలక భేటీ- పార్లమెంటులో విపక్షాల రచ్చ నేపథ్యంలో వ్యూహారచన
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా ఉభయసభల్లో నిరసనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కీలకమైన సమస్యలపై కేంద్రం చర్చించేందుకు సిద్ధంగా లేకపోవడంపై ఆగ్రహంగా ఉన్న విపక్షాలు.. ఇరు సభల్లోనూ నిరసనలు తెలుపుతున్నాయి. అదేసమయంలో రాజ్యసభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ వ్యవహారంపైనా చాలా పార్టీలు అసంతృప్తిగా ఉన్నాయి.
విపక్షాల నిరసనలతో పార్లమెంటు సమావేశాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ .. ఇవాళ తన కేబినెట్ లోని కీలక మంత్రులతో సమావేశమయ్యారు. హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు మంత్రులు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో విపక్షాల నిరసనల నేపథ్యంలో సమావేశాల్ని ఈ నెల 23 వరకూ కొనసాగించడం ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో కీలకమైన బిల్లులపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రధాని మోడీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

రైతులకు కనీస మద్దతు ధర, జాతీయ ఆహార విధానం, పెగాసస్ నిఘా, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలపై చర్చల కోసం విపక్షాలు పట్టుబడుతున్నాయి. కానీ కేంద్రం అందుకు నిరాకరిస్తోంది. అలాగే రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ ఉపసంహరించుకోవాలని విపక్షాలు కోరుతున్నా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అందుకు అంగీకరించడం లేదు దీంతో కేంద్రం వైఖరిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. వరుసగా నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు పలుమార్లు వాకౌట్ కూడా చేస్తున్నాయి. మరోవైపు పార్లమెంటు బయట సస్పెండైన రాజ్యసభ ఎంపీలు కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. వీరికి విపక్షాల మద్దతు పెరుగుతోంది. దీంతో కేంద్రం ఆందోళన చెందుతోంది. పరిస్ధితి తీవ్రతను గమనించిన ప్రధాని మోడీ.. మంత్రులతో దీనిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేతతో పాటు మరికొన్ని అంశాలపై విపక్షాలతో చర్చించి చూసే అవకాశాలు లేకపోలేదని అర్ధమవుతోంది. అయితే ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాల్సి ఉంది.
పార్లమెంటు సమావేశాల్లో కీలకమైన వ్యవసాయ బిల్లు రద్దు ప్రక్రియ పూర్తయినా, ఇంకా క్రిప్టో కరెన్సీ బిల్లుతో పాటు మరికొన్ని కీలక బిల్లుల్ని కేంద్రం ఆమోదింపచేసుకోవాల్సి ఉంది. కానీ విపక్షాల రచ్చ కొనసాగితే వాటిని కూడా మూజువాణి ఓటుతో ఆమోదించుకోవాల్సిన పరిస్ధితి వస్తుందని కేంద్రం భయపడుతోంది. ఇప్పటికే వ్యవసాయ బిల్లుల ఆమోదం, రద్దు కూడా మూజువాణి ఓటుతో పూర్తి చేసుకోవడంపై కేంద్రం విమర్శలు ఎదుర్కొంటోంది.












Click it and Unblock the Notifications