అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ
దేశ రాజధాని వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. త్వరలో అతిపెద్ద చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోబోతోన్నామని అన్నారు. 21వ శతాబ్దంలో తీసుకున్న నిర్ణయాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఇది దేశాభివృద్ధికి మరింత ఊపునిస్తుందని, మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలను మలుపు తిప్పుతుందని అన్నారు.
ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళన్ లో మోదీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును 21వ శతాబ్దపు అత్యంత ప్రముఖ నిర్ణయాల్లో ఒకటిగా అభివర్ణించారు. ఈ ప్రతిపాదిత చట్టం నారీ శక్తికి అంకితం చేస్తామని, ఇదొక చారిత్రాత్మక ముందడుగు అవుతుందని స్పష్టం చేశారు, దేశ పురోగతిలో అనేక కీలక మైలురాళ్లను అధిగమిస్తున్న తరుణంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యంత అవసరమని అన్నారు.

పాలన, నిర్ణయాల ప్రక్రియలో సామాజిక న్యాయాన్ని ఒక ముఖ్య, అంతర్భాగ అంశంగా మార్చడంలో ఈ బిల్లు కీలక పాత్ర పోషిస్తుందని మోదీ వివరించారు. ఈ బిల్లును ఆమోదించడంతో దేశ పార్లమెంట్ ఒక కొత్త చరిత్రను సృష్టించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. సమానత్వం గల భారత్ కోసం, సామాజిక న్యాయం అనేది నినాదాలకు మాత్రమే పరిమితం కాకూడదనేది తమ అభిప్రాయమని చెప్పారు. పాలనాపరమైన నిర్ణయాల ప్రక్రియలో మహిళలు భాగస్వామ్యులయ్యే సంకల్పానికి ఇది నాంది పలుకుతుందని పేర్కొన్నారు.
మహిళల ప్రాతినిథ్యంపై దశాబ్దాలుగా అసెంబ్లీల నుండి పార్లమెంట్ వరకు ఉన్న నిరీక్షణకు ఈ చట్టం తెరదించుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య నిర్మాణాలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని, దశాబ్దాలుగా చాలామంది ఇదే అభిప్రాయాన్ని తెలియజేస్తోన్నారని గుర్తు చేశారు. ఈ విషయం దాదాపు నాలుగు దశాబ్దాలుగా చర్చలో ఉందని, అన్ని రాజకీయ పార్టీల కృషి ఇందులో ఉందని ఆయన వివరించారు. ప్రతి పార్టీ తమదైన పద్ధతిలో ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్ళిందని వ్యాఖ్యానించారు.
మహిళా సాధికారత చట్టాన్ని 2029 నాటికి అమలు చేయాలని ప్రజాప్రతినిధుల నుండి ఏకగ్రీవ డిమాండ్ వచ్చిందని ప్రధాని వెల్లడించారు. ఈ అంశంపై ఏప్రిల్ 16 నుండి పార్లమెంటులో సమగ్ర చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. మహిళల సాధికారత ప్రయోజనం కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పరస్పర సహకారం, భాగస్వామ్యంతో ముందుకు సాగాలనేదే తమ ప్రయత్నమని, అందరి ఆకాంక్ష కూడా అదే అవుతుందని అంచనా వేశారు.












Click it and Unblock the Notifications