దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ: ఇంకాస్సేపట్లో..టీవీల్లో: సబ్జెక్ట్ ఇదే
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలో జోరుగా సాగుతోంది. వంద కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఇదో మైలురాయి. 10 నెలల వ్యవధిలో దేశంలో వంద కోట్ల మంది కరోనా వ్యాక్సిన్‌ను వేసుకున్నారు. ఇందులో సింగిల్ డోస్ తీసుకున్న వారి సంఖ్యే అధికం. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోసం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తోన్న కోవిషీల్డ్, హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్లను విస్తృతంగా వినియోగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులోనూ కోవిషీల్డ్ వాటా అధికంగా ఉంటోంది.
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. ఇది పరిమితం. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను వినియోగిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన స్వయంగా దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు వెళ్లి టీకా తీసుకున్నారు. మొదట్లో 45 సంవత్సాలకు పైనున్న వయస్సు గల వారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రప్రభుత్వం.

ఆ తరువాత వ్యాక్సిన్ లభ్యత పెరిగే కొద్దీ.. ఆ పరిమితిని ఎత్తివేస్తూ వచ్చింది. ఇప్పుడు 18 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారి వరకు వ్యాక్సిన్లను వేసుకుంటున్నారు. ఈ మార్క్ వంద కోట్లకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మరోసారి టీవీల ముందుకు రానున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం ఈ ఉదయం 10 గంటలకు ఉంటుంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం వంద కోట్లకు చేరుకున్న సందర్భంగా.. ఆయన దేశ ప్రజల ముందుకు రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
PM @narendramodi will address the nation at 10 AM today.
— PMO India (@PMOIndia) October 22, 2021
ఇదివరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న తొలి రోజుల్లో, లాక్‌డౌన్ విధించిన సమయంలో ప్రధాని మోడీ విస్తృతంగా ప్రజల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ ముగింపు దశకు వచ్చిన ప్రతీసారీ ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు ప్రకటించారు. ఆ తరువాత దీపాలను వెలిగించడం, చప్పట్లు కొడుతూ ఫ్రంట్‌లైన్ వర్కర్లను అభినందించడం, వారిపై పూల వర్షాన్ని కురిపించడం వంటి విషయాలను ప్రకటించడానికి ప్రధాని మోడీ దేశ ప్రజల ముందుకు వచ్చేవారు. ఇప్పుడు మళ్లీ అలాంటి సందర్భమే వచ్చింది. వంద కోట్ల మార్క్‌కు చేరువైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.