మరోసారి కోవిడ్ అలర్ట్ : లక్షణాలు ఇవే - మార్గదర్శకాలు ఇలా : ప్రధాని మోదీ సమీక్ష..!!
మరోసారి కోవిడ్ ముప్పు పొంచి ఉంది. పలు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా బీఎఫ్.7 వేరియంట్ భారత్‌లోనూ వెలుగులోకి వచ్చింది. దీంతో, ఈ సారి కేంద్రం ముందుగానే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మార్గదర్శకాలను జారీ చేసింది. అత్యంత వేగంగా వ్యాపించే లక్షణాలు ఉన్న ఈ బీఎఫ్.7 వేరియంట్ పైన తెలుగు రాష్ట్రాల్లోనూ ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఆరోగ్య నిపుణులు ఆందోళన అవసరం లేదని..అప్రమత్తత ముఖ్యమని చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్ష చేసారు. ఇప్పుడు ప్రధాని మోదీ స్వయంగా ఉన్నత స్థాయి సమీక్షకు సిద్దమయ్యారు. తాజా వేరియంట్ వ్యాప్తి వేళ కేంద్రం మరిన్ని గైడ్ లైన్స్ జారీకి సిద్దం అవుతోంది.

అప్రమత్తమైన కేంద్రం - ప్రధాని సమీక్ష
చైనాలోని బీజింగ్‌లో అక్టోబరు నెలలో బీఎఫ్.7 వేరియంట్ వెలుగులోకి వచ్చింది. తాజాగా గుజరాత్‌లోనే మరో వ్యక్తికి, ఒడిసాలో ఇంకో వ్యక్తికి బీఎఫ్.7 సోకినట్లు తేలినా.. ఆ ముగ్గురూ హోంఐసోలేషన్‌లోనే కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. చైనా పెరుగుతున్న కేసులు..కొత్త వేరియంట్ కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయా వెంటనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసారు. కొత్తరకంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందకుండా విమానాశ్రయాలు.. ట్రేసింగ్.. టెస్టింగ్ పైన స్పష్టత ఇచ్చారు. కూడా బీఎఫ్.7 భారత్‌లో వెలుగు చూసినా.. కేసుల పెరుగుదల లేదని వివరించారు. చైనాలో బీఎఫ్.7 వేగంగా విస్తరిస్తున్నా.. మన దగ్గర దాని ప్రభావం అంతగా లేదని చెబుతున్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్షకు నిర్ణయించారు. ముందస్తు చర్యలపైన ప్రధాని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

బీఎఫ్.7 లక్షణాలు ఇలా..
ఈ కొత్త వేరియంట్ లక్షణాల పైన కొంత స్పష్టత వస్తోంది. ఈ వేరియట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించారు. ఒకరికి ఈ వేరియంట్ సోకితే.. వారి నుంచి కనిష్ఠం సగటు 10 నుంచి గరిష్ఠం సగటు 18.6 మందికి వ్యాప్తిచెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది వేగంగా వ్యాపిస్తుంది. ఈ వేరియంట్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, గొంతు గరగర, జలుబు, నీరసం, విపరీతంగా ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అతి కొద్ది కేసుల్లో వాంతులు, డయేరియా వంటి పొట్ట సంబంధ వ్యాధులు బయటపడవచ్చని చెబుతున్నారు. దీంతో, రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కేంద్రం సూచిస్తోంది. వేరింట్ విస్తరణ పైన ప్రతీ వారం సమీక్ష చేయాలని కేంద్రం నిర్ణయించింది.

తెలుగు రాష్ట్రాల్లో పూర్తి నియంత్రణలో
తాజాగా మరోసారి కరోనా వేరియంట్ వ్యాప్తి పైన చర్చ మొదలైంది. కేంద్రం ముందస్తుగానే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మినహా మరెక్కడా కోవిడ్ కేసులు నమోదు కావటం లేదు. ఈ రోజు ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసారు. ఏపీలోనూ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, విమానాశ్రయాలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకించి చైనా నుంచి వచ్చే వారి విషయంలో జాగ్రత్తలు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని సమీక్ష తరువాత రాష్ట్రాలకు మరిన్ని కీలక సూచనలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications