కాలేజ్ గర్ల్ నేహా ఇంటికి భారీ బందోబస్తు, అధికార పార్టీ లీడర్ కు ప్రాణహాని, సీఎం ఆదేశాలతో!
కర్ణాటకలోని హుబ్బళ్లిలోని ఓ కళాశాలలో క్యాంపస్ లో నేహా హిరేమఠ్ అనే అమ్మాయి హత్యకు గురికావడంతో కర్ణాటకలో కలకలం రేపిన విషయం తెలిసిందే. నేహా తండ్రి నిరంజన్ హిరేమఠ్ నివాసానికి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య ఆయన్ను ఓదార్చారు. సీఎం వెళ్లి వచ్చిన తరువాత నేహా నివాసానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుబ్బళి మహానగర కార్పొరేషన్ కాంగ్రెస్ కార్పొరేటర్, నిరంజన్ కుమార్తె నేహా హత్య తర్వాత ఆయన ఇంటికి గట్టి భద్రత కల్పించారు.
ఈ మేరకు నిరంజన్ ఇంటి దగ్గర ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. నేహా హత్యకు సంబంధించి తనకు కొంతమంది నుంచి హత్య బెదిరింపులు వచ్చాయని నిరంజన్ గురువారం ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా శుక్రవారం హుబ్బళి-ధారవాడ మెట్రోపాలిటన్ పోలీసు యూనిట్ నిరంజన్ ఇంటి దగ్గర భారీ బందోబస్తూ ఏర్పాటు చెయ్యడమే కాకుండా నిరంజన్ కు గన్ మెన్ ఇచ్చారని పోలీసుల వర్గాలు తెలిపాయి.

సీఎం సిద్ధరామయ్య హుబ్బళిలోని నేహా హిరేమఠ్ నివాసాన్ని సందర్శించిన తరువాత వారికి ఇంటికి పోలీసులు భద్రత కల్పించడం హాట్ టాపిక్ అయ్యింది. సీఎం సిద్ధరామయ్య నిరంజన్ కుటుంబ సభ్యులకు ఇచ్చిన హామీ ఏమిటి, నేహా ఇంటికి వచ్చిన అనుమానాస్పద వ్యక్తులు తమను ఓదార్చాలనే నెపంతో ఇంటికి వచ్చారని, తన కూతురు ఉండే పడక గదిని కూడా వీడియో తీశాడని నేహా తండ్రి నిరంజన్ హిరేమఠ్ ఇటీవల ఆరోపించారు.
నేహా కుటుంబానికి ప్రాణహాని ఉందని వెలుగు చూసింది. ఇదంతా చూస్తుంటే మా కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందని, అందువల్ల మాకు ప్రాణహాని ఉందనే కోణంలో విచారణ జరిపించాలని మృతురాలు నేహా తండ్రి నిరంజన్ డిమాండ్ చేశారు. హుబ్బళిలోని బిదనాలలోని నిరంజన్ నివాసం వద్ద కూడా భద్రత కోసం పోలీసులను మోహరించారు. నేహాను హత్య చేసిన ఫయాజ్ జైల్లో ఉన్నా అతని మొబైల్ లో ఫోటోలు ఎలా లీక్ అయ్యాయని ఇటీవల బీజేపీ నాయకులు ప్రశ్నించారు.

నిరంజన్ కుటుంబానికి భద్రత కల్పించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. నిరంజన్ కుటుంబానికి భద్రత కల్పించే బాధ్యతను హుబ్బళి- ధారవాడ పోలీస్ కమిషనర్ రేణుకా సుకుమార్ నిర్వహిస్తున్నారు. గురువారం నాడు నేహా తండ్రిని పరామర్శించిన సీఎం సిద్ధరామయ్య వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మేము మీతో ఉన్నామని, కర్ణాటకలో మన ప్రభుత్వం అధికారంలో ఉందని మీరు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో నేహా మృతికి న్యాయం చేస్తామని సీఎం సిద్ధరామయ్య నిరంజన్ కు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications