అసభ్యత: నగ్మాకు అదనపు భద్రత, హేమపై అమర్‌సింగ్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్న నాటి ప్రముఖ కథానాయికలు హేమమాలిని, నగ్మాలకు అదనపు భద్రతకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నగ్మా ఉత్తర ప్రదేశ్ మీరట్ నుండి కాంగ్రెసు పార్టీ తరఫున, హేమమాలిని మధుర నియోజక వర్గాల నుండి లోకసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
వీరు ప్రచారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హేమమాలిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలి వస్తున్నారు. వారిని అదుపు చేయడం ఉన్న సిబ్బంది వల్ల కావడం లేదు. మరోవైపు నగ్మాకు ప్రచారం సమయంలో రెండు మూడు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

ఈ నేపథ్యంలో వారికి అదనపు భద్రతను కోరారు. దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నగ్మా, హేమమాలినిలకు అదనపు భద్రతను కేటాయించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం అంగీకారం తెలిపింది.
మరోవైపు, హేమమాలిని పైన ఆర్ఎల్డీ నేత అమర్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనకు డ్రీమ్ గర్ల్ వద్దని, రైతులు కావాలని అమర్ తన ప్రచారంలో వ్యాఖ్యానించారు. పారిస్‌కు చెందిన బ్రాండెడ్ పర్‌ఫ్యూమ్స్ ఉపయోగించే వారు మనకు వద్దని హేమమాలిని ఉద్దేశించి అన్నారు. దీనిపై బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమర్ వ్యాఖ్యల పైన తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపింది.












Click it and Unblock the Notifications