Bengaluru: బెంగళూరుకు జనానికి చుక్కలు..! కరెంటూ, నీరూ లేక ?
కర్నాటక రాజధాని బెంగళూరు వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ కోతలతో పాటు నీటి సరఫరా ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ నెల 15 నుంచి వివిధ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేతకు సంబంధించి అధికారులు ప్రజలకు సమాచారం ఇస్తున్నారు. దీంతో పాటు ఇవాళ్టి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోతోంది. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు.
ఇవాళ్టి నుంచి రేపు సాయంత్రం వరకూ సాధారణంగా మూడు నెలలకోసారి చేపట్టే నిర్వహణ పనుల కారణంగా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఆరు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు ప్రకటించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మరమ్మత్తుల కారణంగా ఇలా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు తెలిపారు. బెంగళూరులో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

ఇవాళ నగరంలోని ఇస్రో, బాగ్మనే టెక్ పార్క్, జీటీఆర్ఈ, డబ్ల్యూటీసీ, మారతహళ్లి, దొడ్డనెకుండి, ఇందిరానగర్ డిఫెన్స్ కాలనీతో సహా అనేక ప్రాంతాలు, కీలక సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచింది. తుమకూరు జిల్లాలోని నిట్టూరు, గుబ్బి, బిద్రే, దొడ్డగుణి, కడప, సి.టి. కేరే సబ్‌స్టేషన్ ద్వారా సేవలందిస్తున్న ఇతర పట్టణాలు , గ్రామాలలో విద్యుత్తు అంతరాయం ఏర్పడుతోంది. నిర్వహణ పనుల కోసం సెప్టెంబర్ 13-14 తేదీలలో విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు బెంగళూరు వాటర్ అండ్ సీవరేజ్ బోర్డు అత్యవసర నిర్వహణ పనుల కారణంగా నగరంలో సెప్టెంబర్ 15 నుండి 17 వరకు 60 గంటల నీటి సరఫరా కోత విధిస్తున్నారు. ఈ షట్‌డౌన్ సెప్టెంబర్ 16న ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 17న ఉదయం 6 గంటల వరకు ఉంటబోతోంది. కావేరీ స్టేజ్ I-IV కోసం ఫేజ్-1 , ఫేజ్-2 స్టేషన్లలో కావేరీ స్టేజ్ 5 పంపింగ్ , నిర్వహణపై ప్రభావం చూపనుంది. ఈ కాలంలో తగినంత నీటిని ముందుగానే నిల్వ చేసుకుని జాగ్రత్తగా వాడుకోవాలని అధికారులు ప్రజలకు సలహా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications