ఐదు నెలల గర్భంతో ఉన్న లివ్- ఇన్ పార్ట్ నర్ హత్య.. అద్దె ఇంట్లో మృతదేహం వదిలి ప్రియుడు పరార్
రాజస్థాన్ లోని అల్వార్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లివ్ ఇన్ పార్ట్ నర్స్ మధ్య చిన్న గొడవ కారణంగా ఐదు నెలల గర్భంతో ఉన్న మహిళను యువకుడు దారుణంగా హత్య చేశాడు. అద్దె ఇంట్లోనే మృతదేహం వదిలి అక్కడి నుంచి పరార్ అయ్యాడు. అయితే అద్దె ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న మహిళను చూసిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టంలో మృతురాలు ఐదు నెలల గర్భిణి అని తేలడంతో ఇదే విషయంపై ఇరువురి మధ్య గొడవ చెలరేగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని మాథుర్ జిల్లాలోని గోవర్ధన్ ప్రాంతానికి చెందిన కుమ్ కుమ్(28), యోగేష్ చౌదరి(25) లు ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే ఆ ఇద్దరికి అప్పటికే వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు జరిగి ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ వీరిద్దరూ ఏడాదిన్నర క్రితం తమ కుటుంబాలను వదిలేసి, అల్వార్ లో సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఇక కుమ్ కుమ్ రీల్స్ చేస్తూ కంటెంట్ క్రియేటర్ అవతారం ఎత్తగా.. యోగేష్ ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో కుమ్ కుమ్ గర్భం దాల్చింది. అయితే ఇదే విషయంపై ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గొడవ తీవ్రతరం కావడంతో కోపోద్రిక్తుడైన యోగేష్ కుమ్ కుమ్ ను దారుణంగా హత్య చేసినట్లు స్పష్టం అవుతోంది. దాంతో అక్కడి నుంచి అతడు పారిపోయాడు. ఇక అద్దె ఇంట్లో కుమ్ కుమ్ విగతజీవిగా కనిపించడం చూసి భయపడిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్థలానికి చేరుకున్న పోలీసులు కుమ్ కుమ్ మెడపై గుర్తులను గుర్తించారు.

ఘటనా స్థలంలో విరిగిపోయిన మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. వైద్యులు కుమ్ కుమ్ మృతదేహాన్ని పరిశీలించగా ఆమె ఐదు నెలల గర్భిణి అని తేలింది. అటు యోగేష్ వదిలి వచ్చిన భార్య కూడా గర్భం దాల్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక ప్రస్తుతం యోగేష్ పరారీలో ఉన్నాడు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తుండటంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
