ఖతార్ మరణశిక్ష విధించిన నేవీ ఆఫీసర్ల రిలీజ్ కు కేంద్రంపై ఒత్తిడి ! ప్రధాని జోక్యం కోరుతూ..
ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై గతేడాది అరెస్ట్ అయి తాజాగా ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన 8 మంది మాజీ నేవీ అధికారుల విషయంలో ఉత్కంఠ పెరుగుతోంది. తాజాగా కేంద్రం ఈ విషయాన్ని బయటపెట్టిన నేపథ్యంలో ఆయా మాజీ అధికారుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఆయా అధికారుల కుటుంబాలు కేంద్రంతో టచ్ లోనే ఉన్నాయి. తమ వారిని ఎలాగైనా విడిపించాలని ఆయా కుటుంబాలు కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి.
ఖతార్‌లో భారత నావికాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ సిబ్బందిని ఎలా విచారించారనే విషయంలో పారదర్శకత లేకపోవడం, న్యాయ ప్రక్రియపై వారి కుటుంబాల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. దీంతో వారిని ఎలాగైనా విడిపించాలనే విషయంలో సమయం తక్కువగా ఉండటంతో ప్రధాని జోక్యం చేసుకోవాలని ఆయా కుటుంబాలు కోరుతున్నాయి. ఈ కుటుంబాలు గత గురువారం నుంచి నేవీ చీఫ్‌తో సమావేశమయ్యాయని, త్వరలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు.

ఖతార్ ఈ 8 మందికి విధించిన మరణశిక్షకు సంబంధించి పూర్తి వివరాలు ఇవాళ వెల్లడయ్యే అవకాశం ఉంది. కోర్టు వీరికి మరణశిక్ష విధించినా నిర్దిష్టంగా వీరిపై ఉన్న అభియోగాలపై మాత్రం వివరాలు బయటికి రాకపోవడంతో ఆందోళన పెరుగుతోంది. దీంతో కేంద్రం కూడా ఖతార్ ప్రభుత్వంతో సంప్రదింపుల ప్రక్రియను ముమ్మరం చేసింది. ఖతార్ తో చర్చలు ఫలిస్తాయని కేంద్రం కూడా ఆశాభావంగా ఉంది. అయినా నేవీ అధికారుల కుటుంబాల్లో మాత్రం ఆందోళన తొలగిపోవడం లేదు.
మరోవైపు ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన 8 మందిని విడిపించేందుకు అక్కడి అప్పీలు కోర్టును ఆశ్రయించడమే తదుపరి మార్గంగా కనిపిస్తోంది. అక్కడా ఫలించకపోతే ఉన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించి వీరి విడుదలకు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని భారత్ అంచనా వేస్తోంది. దీంతో పాటు దౌత్య ప్రక్రియను కూడా ముమ్మరం చేసి వీరి విడుదలకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. దీంతో వీరి విడుదల ఎన్నికలకు ముందు కేంద్రానికి మరో ఇబ్బందికరమైన వ్యవహారంగా మారబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications