ప్రధాని మోదీ బిగ్ ప్లాన్: దేశ పరీక్షల వ్యవస్థను మార్చే ఆరుగురు మహామహులు వీరే!
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు విద్యార్థులలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్న నేపథ్యంలో పరీక్షా విధానాన్ని సంస్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటితో సహా ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రకటించింది. గోమూత్రంపై కామకోటి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే విమర్శలను ఎదుర్కొంటున్నందున.. ఈ కమిటీని అలాంటి వ్యక్తులతోనే ఏర్పాటు చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ బృందంలో ఛైర్మన్‌గా నందన్ నీలేకణి, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి, ఇస్రోకు చెందిన ఎస్.సోమనాథ్, తపన్ కుమార్ దేకా, అనితా గర్వాల్, అమృత్ లా మీనా ఉన్నారు. వారు ఎవరో, వారి పని ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
నందన్ నీలేకణి(కమిటీ ఛైర్మన్)
పరీక్షా సంస్థ నిర్వహించే పరీక్షలలో అమలు చేయాల్సిన సంస్కరణలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ ప్రాజెక్టు రూపశిల్పులలో ఒకరైన నందన్ నీలేకణి ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన యూఐడీఏఐ(UIDAI)కి ఆయన తొలి ఛైర్మన్‌గా పనిచేశారు. కోట్లాది మంది ప్రజల కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను విజయవంతంగా నిర్మించిన అనుభవం ఆయనకు ఉంది. డిజిటల్ టెక్నాలజీ పర్యవేక్షణతో పరీక్షలను మోస రహితంగా, సురక్షితంగా మార్చడమే ఆయన తొలి కర్తవ్యం. ఆయనకున్న విశేష అనుభవం దృష్ట్యా దేశ పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ఆయనను ఛైర్మన్ గా ఎంపిక చేసింది.

ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ ఛైర్మన్, చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 మిషన్లకు నాయకత్వం వహించిన ఎస్.సోమనాథ్‌కు సంక్లిష్టమైన ఇంజనీరింగ్ వ్యవస్థలను, సురక్షిత, విశ్వసనీయభద్రతా విధానాలను రూపొందించడంలో సంవత్సరాల అనుభవం ఉన్న ఏరోస్పేస్ ఇంజనీర్ ఆయన. ఎలాంటి ముప్పు చొరబడలేని విధంగా ఎంపిక ప్రక్రియ పటిష్టంగా ఉండేలా చూడటమే ఆయన పని. సురక్షితమైన, తప్పులకు ఆస్కారం లేని ఆపరేషనల్ సిస్టమ్స్ ను రూపొందించడంలో ఆయనది ప్రత్యేక స్టైల్. పరీక్షల నిర్వహణలు సాంకేతిక భద్రతను పటిష్టం చేయడంలో ఆయన పాత్ర కీలకం.
తపన్ దేకా
1988 బ్యాచ్ అస్సాం-మేఘాలయ ఐపీఎస్ కేడర్‌కు చెందిన ఈయన, మాజీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా అనుభవం కలిగి ఉన్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, సైబర్ ముప్పులు, తీవ్రమైన కుట్రల దర్యాప్తులో ఈయనకు విస్తారమైన అనుభవం ఉంది. ప్రశ్నపత్రాల లీకులు, మౌలిక సదుపాయాలలోకి చొరబాటు, మోసపూరిత నెట్‌వర్క్‌లలో పాలుపంచుకున్న మాఫియా ముఠాలను గుర్తించి, నిర్మూలించి, పటిష్టమైన భద్రతా ప్రణాళికలను రూపొందించగలరు.
డాక్టర్ వి.కామకోటి
ఐఐటి మద్రాస్ డైరెక్టర్ అయిన డాక్టర్ కామకోటి ఓ ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త. ఆయన భారతీయ ప్రాసెసర్‌ల అభివృద్ధిలో, శక్తి మైక్రోప్రాసెసర్ వంటి స్వదేశీ సాఫ్ట్‌వేర్ సాంకేతికతల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ టెక్నాలజీ విద్యలో ఆయనకున్న అనుభవంతో, కంప్యూటర్ ఆధారిత ప్రశ్నపత్రాల భద్రతకు, పరీక్షా-కేంద్రీకృత సాంకేతికతకు పరిష్కారాలను కనుగొనాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వివాదాలకు కూడా దారితీశాయి. జనవరి 2025లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఆవు మూత్రానికి జ్వరాన్ని నయం చేసే వైద్య గుణాలు ఉన్నాయని పేర్కొంటూ ఆయన చెప్పిన ఓ ఉదాహరణ శాస్త్ర సాంకేతిక వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. శాస్త్రీయ నిరూపణలు లేని ఇలాంటి ప్రకటనలు ఆమోదయోగ్యం కాదని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో ఈ బృందంలో ఆయన చేరడం చర్చనీయాంశంగా మారింది.
అనితా కర్వాల్
అనితా కర్వాల్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారిణి. ఈమె కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా, సీబీఎస్ఈ ఛైర్మన్‌గా పనిచేశారు. పాఠశాల విద్యా సంస్కరణలు, అభ్యసన ఫలితాలు , జాతీయ స్థాయి పబ్లిక్ పరీక్షలను విజయవంతంగా అమలు చేసిన అనుభవంతో, ఆమె కొత్త సంస్కరణలు విద్యా సంస్థల ఆచరణాత్మక సందర్భానికి అనుగుణంగా అమలు అయ్యేలా చూస్తారు.
అమృత్ లాల్ మీనా
ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన లాజిస్టిక్స్‌లో నిపుణుడు. దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల సురక్షిత రవాణా, ఇందుకోసం ఓ గొలుసుకట్టు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం, ఏజెన్సీల మధ్య సమన్వయం చేయడం వంటి బాధ్యతలను ఆయన నిర్వర్తిస్తారు.
ఈ కమిటీ పరీక్షా సంస్థ నిర్వహించే పరీక్షలలో సంస్కరణలను సిఫార్సు చేస్తుంది. తదనుగుణంగా మార్పులు చేస్తే భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య ఉండదని కేంద్ర ప్రభుత్వం గట్టిగా చెబుతోంది.












Click it and Unblock the Notifications