కన్నీళ్ళతో, గద్గద స్వరంతో బహిరంగసభలో మాట్లాడిన ప్రధాని మోడీ.. ఎందుకంటే!!
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు గంభీరంగానే కనిపిస్తారు. పొరపాటున కూడా తనలోని భావోద్వేగాలను బయటపడనివ్వరు. అయితే ఈ రోజు నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కంట కన్నీరు ప్రతి ఒక్కరిని షాక్ గురిచేసింది. కన్నీళ్లను ఆపుకుని గద్గద స్వరంతో ఆయన చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరి హృదయాలలో వేదనను నింపింది.
నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలోని షోలాపూర్ లో పర్యటించారు. దేశంలోనే అతిపెద్ద సొసైటీగా ప్రధానమంత్రి ఆవాస యోజన కింద నిర్మించిన ఇళ్లను నరేంద్ర మోడీ ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో, అన్ని వసతులతో నిర్మించిన ఈ ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళలో, దేశంలోనే తొలి స్థానాన్ని సంపాదించుకున్నాయి.

నేడు భారీ సంఖ్యలో ఇళ్లను ప్రారంభించిన ఆయన అనంతరం ప్రసంగిస్తూ ప్రస్తుతం ఇళ్లల్లోకి వెళుతున్న వారంతా అదృష్టవంతులని, అన్ని వసతులు, సౌకర్యాలతో, అధునాతన నిర్మాణాలతో కూడిన ఇళ్లను సొంతం చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో తాను చిన్నప్పుడు ఉన్న ఇంటిని గుర్తు చేసుకుని, తన బాల్యాన్ని తలుచుకున్న ప్రధాని మోడీ కి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
తన చిన్నప్పుడు ఇలాంటి ఇళ్ళల్లో ఉండే అవకాశం తమకు రాలేదని, చిన్న ఇంట్లోనే అందరం కాళ్లు ముడుచుకుని ఉండే వాళ్ళమని చెప్పిన మోడీ, ఒక్కసారిగా ఆవేదనకు లోనయ్యారు. మోడీ గొంతులో బాధ అప్పుడు స్పష్టంగా వినిపించింది. అనంతరం పక్కనే ఉన్న గ్లాసులో మంచినీళ్లు తాగి, కొద్దిసేపు తన ప్రసంగాన్ని ఆపేసిన మోడీ, మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం ఆయన గద్గద స్వరంతోనే మాట్లాడారు.
నేడు తమ ప్రభుత్వం పేదలకు అధునాతన ఇళ్లను నిర్మించి ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఇక ఇదే సమయంలో పేదలకు మేలు చేయాలన్న సంకల్పంతో అయోధ్య రాముడిని ఆదర్శంగా తీసుకునే తమ ప్రభుత్వం నిజాయితీగా పని చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ప్రతి ఒక్కరు రాముడి బాటలోనే నడవాలన్నది తమ ఉద్దేశమని మోడీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications