ప్రియాంక గాంధీ, అఖిలేష్‌లకు షాక్: బీజేపీలోకి ప్రమోద్ గుప్తా, ప్రియాంక మౌర్య, సంచలన ఆరోపణలు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ప్రధాన పార్టీల్లో వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం సమాజ్ వాదీ పార్టీకి గట్టి షాకిస్తూ ఆ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, ములాయం తోడల్లుడు, ఎస్పీ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా కమలం పార్టీలోకి చేరారు.

ఖైదీగా ములాయం: బీజేపీలోకి అఖిలేష్ బంధువు ప్రమోద్ గుప్తా
గురువారం బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ప్రమోద్ గుప్తా కాషాయ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రమోద్ గుప్తా మాట్లాడుతూ.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాఫియా, నేరస్థులను ఎస్పీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీ వ్యవస్థాపకుడైన నేతాజీ ములాయం సింగ్ యాదవ్ పార్టీలో ఖైదీగా మారిపోయారన్నారు. ఆయన, శివపాల్ యాదవ్ పట్ల అఖిలేష్ దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక అలాంటి పార్టీలో ఉండటం అనవసరం అనిపించిందని, అందుకే బీజేపీలో చేరినట్లు గుప్తా తెలిపారు. కాగా, ములాయం సింగ్ సతీమణి సాధనా గుప్తా సోదరి భర్తే ప్రమోద్ గుప్తా. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.

ప్రియాంక గాంధీకి షాకిచ్చిన ప్రియాంక మౌర్య, బీజేపీలోకి
ఇది ఇలావుండగా, ప్రమోద్ గుప్తాతోపాటు కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకురాలు, ప్రియాంక గాంధీ సన్నిహితురాలైన ప్రియాంక మౌర్య కూడా బీజేపీలో చేరారు. 'నేను అమ్మాయిని, పోరాడగలను' అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన ప్రియాంక మౌర్య ఇప్పుడు బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ 'గర్ల్ హూన్, ఫైట్ హూన్' అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి.. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మౌర్య భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.

డబ్బులిస్తేనే టికెట్ అంటూ కాంగ్రెస్ పార్టీపై ప్రియాంక ఫైర్
ప్రియాంక మౌర్య ఇటీవల సంచలన ఆరోపణ చేశారు. ప్రియాంక గాంధీ వ్యక్తిగత కార్యదర్శి సందీప్ సింగ్ డబ్బు తీసుకొని పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నారని ఆమె ఆరోపించారు. లక్నోలోని సరోజినీ నగర్ స్థానం నుంచి ప్రియాంక టికెట్ అడుగుతున్నారు. తనకు కాకుండా డబ్బులు ఇచ్చినవారికి మాత్రమే టికెట్లు దొరుకుతున్నాయని ప్రియాంక గాంధీపైనా కాంగ్రెస్ అధిష్టానంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రియాంక మౌర్య. తన నియోజకవర్గంలో తాను కష్టపడి పనిచేశానన్నారు ప్రియాంక మౌర్య. కానీ, కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఇంకా, కాంగ్రెస్ మహిళల హక్కుల గురించి మాట్లాడుతుందని మండిపడ్డారు. కానీ, మా హక్కుల సంగతి వచ్చేసరికి మమ్మల్ని పక్కన పెట్టారు. మహిళల కోసం అంటూ కాంగ్రెస్ చేసే ప్రచారం కేవలం బూటకమని ప్రియాంక విమర్శించారు.