Yogi Adityanath తోక కత్తిరిస్తున్న బీజేపీ- గోరఖ్ పూర్ లో పోటీ అందుకే-ప్రియాంక వ్యాఖ్యలు
యూపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ముఖ్యంగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను టార్గెట్ చేస్తూ ప్రత్యర్ధి పార్టీలు చెలరేగిపోతున్నాయి అందులోనూ గోరఖ్ పూర్ అసెంబ్లీ సీటు నుంచి యోగీ ఆదిత్యనాథ్ పోటీపై ప్రత్యర్ధులు ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ తొలిసారిగా గోరఖ్ పూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. దీంతో బీజేపీ కంచుకోట అయిన గోరఖ్ పూర్ నుంచి ఆయన గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవు. కానీ గోరఖ్ పూర్ నుంచి యోగీ ని బరిలోకి దింపడం ద్వారా బీజేపీ నేతలు ఆయనకు కత్తెర వేస్తున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తాజాగా ఆరోపించారు. నిరంకుశ వ్యవస్థలోలా పార్టీలో యోగీ ప్రభావానికి కత్తెర వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు.

జనవరి 15న, అధికార బీజేపీ యోగీ ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రకటించడంతో అప్పటి వరకూ అనుకున్నట్లుగా ముఖ్యమంత్రి అయోధ్య సీటు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారనే ఊహాగానాలకు తెరపడింది. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడం ఇదే తొలిసారి.
దీంతో ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ యోగీ అయోధ్యలో పోటీ చేయాలని భావించినా పార్టీ మాత్రం ఆయన్ను గోరఖ్ పూర్ కు పరిమితం చేసినట్లు ప్రియాంక వ్యాఖ్యానించారు. జాతీయ స్ధాయిలో ప్రధాని మోడీకి పోటీ వస్తారని భావించడం వల్లే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఆరోపిస్తున్నారు. దీంతో ప్రియాంక ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.