
రంగంలోకి ప్రియాంక గాంధీ - కీలక నిర్ణయం..!!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న వేళ..అదే కుటుంబం నుంచి మరో కీలక ప్రకటన వచ్చింది. రాహుల్ సోదరి ప్రియాంక పార్టీ కోసం ఇక ప్రజల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సమయం నుంచి పార్టీ కోసం క్రియాశీలకంగా మారిన ప్రియాంక ఇప్పుుడు 2024 ఎన్నికలే లక్ష్యంగా కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం అన్ని రాష్ట్రాల్లోనూ పాదయాత్రకు నిర్ణయించారు. దీనికి సంబంధించి ముహూర్తం సైతం డిసైడ్ అయింది.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ యాత్ర కొనసాగుతోంది. కేరళలో ప్రారంభించి కాశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్రకు నిర్ణయించారు. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో పూర్తయింది. మధ్య ప్రదేశ్ లో ప్రస్తుతం యాత్ర కొనసాగుతోంది. రాహుల్ యాత్రకు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ మంచి స్పందన కనిపించింది. రాహుల్ యాత్రలో పార్టీ ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ఇప్పటికే సోనియా గాంధీతో పాటుగా ప్రియాంక సైతం తన సోదరుడి యాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఇక, ఇప్పుడు తన సోదరుడి పాదయాత్ర ముగుస్తూనే తాను యాత్ర చేయాలని నిర్ణయించారు.

వచ్చే ఏడాది రెండు నెలలపాటు ప్రియాంక 'మహిళా మార్చ్'ను నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. జనవరి 26 నుంచి మార్చి 26 వరకు పాదయాత్ర కొనసాగుతుందని, అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ ఇది జరుగుతుందని ఆయన వివరించారు. కాగా, రాహుల్ భారత్ జోడో యాత్ర ముగింపు రోజునే ప్రియాంక మహిళా మార్చ్ ప్రారంభం కానుంది. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ గైర్హాజరు కానున్నారు. పార్టీ అధ్యక్ష పదవిని సైతం కాదనుకున్న రాహుల్.. ప్రస్తుతం ఈ జోడో యాత్ర నిర్వహణ పైనే ఫోకస్ పెట్టారు. ప్రియాంక ఈ యాత్ర తరువాత తెలంగాణ ప్రాంత పార్టీ వ్యవహారాల పైన ఫోకస్ పెడతారని సమాచారం.