ఆ రోజున కర్ణాటకలో సంపూర్ణ బంద్- బెంగళూరులో రేపే కీలక భేటీ.. !!
కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి నదీ జలాల పంపిణీ వివాదం మరోసారి ముదిరింది. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలంటూ వెలువడిన ఆదేశాలకు నిరసనగా కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వం సైతం తీవ్రంగా స్పందిస్తోంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. కావేరీ జలాల వివాదం పరిష్కారంపై అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించనున్నారు.
కన్నడ సంఘాల ఐక్యవేదిక నేత వాటల్ నాగరాజ్ నేతృత్వంలో బంద్ జరుగనుంది. ఆగస్టు 13వ తేదీన తెల్లవారు జామున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి బంద్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో వాటాల్ నాగరాజ్ ఈ బంద్ వివరాలను వెల్లడించారు. పలు జిల్లాల్లో మంచినీటి కొరత తీవ్రంగా ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించడం సరికాదని, ఈ నిర్ణయం వల్ల కృష్ణరాజసాగర్ రిజర్వాయర్‌లోని నీటి నిల్వలు అడుగంటిపోతాయని వాటల్ నాగరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ బంద్ పిలుపునకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ రైతు సంఘాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. హోటల్ యజమానుల అసోసియేషన్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, లారీ యజమానుల అసోసియేషన్లతో పాటు కన్నడ భాషా రక్షణ వేదికలు కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతో ఆగస్టు 13న కర్ణాటక పూర్తిగా స్తంభించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్టీసీ సహా ఇతర వాహనాలన్నీ నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రైవేట్ విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు సైతం మూతపడే వీలుంది.
అటు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు వ్యతిరేకంగా కూడా వాటల్ నాగరాజ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు 3వ తేదీన తమిళనాడు సీఎం కర్ణాటకలో పర్యటించాలని భావిస్తే.. దానిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఆ రోజున బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ముట్టడికి రక్షణ వేదికలు సిద్ధమవుతున్నాయని, ఛలో ఎయిర్ పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు.
కావేరి జలాల భాగస్వామ్యంపై కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల పట్ల వాటల్ నాగరాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలే ప్రభుత్వం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశాలకు రైతు ప్రతినిధులు, కన్నడ ఉద్యమకారులు, జలవనరుల నిపుణులను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర హితాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కావేరి వ్యవహారంపై తక్షణమే శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన వేదిక నుంచి కేవలం కావేరి అంశమే కాకుండా మరికొన్ని కీలక డిమాండ్లను కూడా ఉద్యమకారులు ముందుకు తెచ్చారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహాదాయి, కళస-బండూరి తాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు. అలాగే స్థానిక కన్నడిగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన, దుకాణాలపై కన్నడ బోర్డుల ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శనివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు డీకే శివకుమార్.













Click it and Unblock the Notifications