పోక్సో కేసులో ప్రముఖ యువ పాస్టర్ అరెస్ట్.. ఇద్దరు బాలికలపై అఘాయిత్యం ?
పేరుకో దైవ సేవ.. భక్తి పేరుతో అమ్మాయిలను లొంగదీసుకునే దొంగ బాబాలు, దొంగ పాస్టర్ ల అరాచకాలకు బ్రేకులు మాత్రం పడటం లేదు. ఎంతో మందికి శిక్షలు పడుతున్నా.. కానీ కొంతమందికి మాత్రం ఇంకా బుద్ది రావడం లేదు. ఎక్కడో ఒక చోట ఈ భక్తి పేరుతో కమంతో కళ్లు మూసుకుపోయిన వారి బాగోతాలు బయటపడుతూనే ఉంటున్నాయి. ఇద్దరు మైనర్లపై అఘాయిత్యానికి పాల్పడిన ఆరోపణలతో ఓ యువ పాస్టర్ అరెస్ట్ కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కింగ్స్ జనరేషన్ చర్చ్ పాస్టర్ 'జాన్ జెబరాజ్' అరెస్ట్ అయ్యారు. ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి చేసిన ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కేరళ లోని మున్నార్‌లో తలదాచుకుని ఉంటున్న జెబరాజ్ పోలీసుల చేతికి చిక్కారు. పోలీసులు అతడిని కోయంబత్తూరుకు తరలించి కోర్టులో హాజరుపరిచిన తర్వాత జుడీషియల్ కస్టడీకి అప్పగించారు.

ఇక 2024 మే లో కోయంబత్తూరులోని తన ఇంట్లో ప్రార్థనా సమావేశం సందర్భంగా వచ్చిన మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో 17 ఏళ్లు, 14 ఏళ్ల బాలిక ఉన్నారు. ఇటీవల బాధిత బాలికల్లో ఒకరు ఈ విషయం గురించి ఓ బంధువుకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో వారి బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కేసు నమోదు అయిన నాటి నుంచి యువ పాస్టర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు ముందస్తు బెయిలు కోసం జాన్ జెబరాజ్ చెన్నై హైకోర్టును ఆశ్రయించాడు. తాను భార్యతో విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నానని.. ఆమె కుటుంబ సభ్యుల ప్రేరణతోనే బాలికలు తప్పుడు ఆరోపణలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే అతడు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు లుక్‌ఔట్ నోటీసు కూడా జారీ చేశారు.
ర్యాప్ పాటల ద్వారా క్రైస్తవ మత ప్రవచనాలు చేస్తూ యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు 'జాన్ జెబరాజ్'. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా అతడు ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. సోషల్ మీడియాలో సైతం ఆయనకు భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. దేవుని సేవ పేరుతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications