గౌతమి షూట్ ఔట్: అగుంబెలో మహేష్ విచారణ
బెంగళూరు: కాడుగోడిలోని ప్రగతి కాలేజ్ అటెండర్ మహేష్ జరిపిన కాల్పులలో తీవ్రగాయాలై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న శిరీషా (17) కోలుకుంటోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. శిరీషా చెప్పే వివరాల ఆదారంగా కేసు దర్యాప్తు చెయ్యాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
గత వారం ప్రగతి కాలేజ్ లో అటెండర్ కే మహేష్ జరిపిన కాల్పులలో అదే కాలేజ్ లో పీయుసీ విద్యాభ్యాసం చేస్తున్న గౌతమి (18) ప్రాణాలు గాలిలో కలిసిపోయిన విషయం తెలిసిందే. బుల్లెట్ గాయాలు కావడంతో పీయుసీ విద్యార్థిని శిరీషా ఇక్కడి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నది.
శిరీషాకు ముక్కు తదితర చోట్ల శాస్త్ర చికిత్స చేశారు. ఈ సందర్బంలో ఆమె ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. శిరీషా ఇచ్చే స్టేట్ మెంట్ ఆదారంగా కేసు దర్యాప్తు త్వరగా పూర్తి చెయ్యాలని, నిందితుడు మహేష్ చెప్పే మాటలు నమ్మరాదని బెంగళూరు పోలీసు అధికారులు భావిస్తున్నారు.

ఆదివారం ఉదయం బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ హరిశేఖరన్, డీసీపీ డాక్టర్ రోహిణి, ఎయిర్ పోర్టు ఉప విభాగం ఏసీపీ దుర్గప్ప తదితరులు వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ చేరుకుని నిందితుడు మహేష్ ను విచారించారు. మహేష్ ఎప్పటిలాగే పొంతనలేని మాటలతో పాత పాట పాడటంతో పోలీసు అధికారులు తలలు పట్టుకున్నారు.
అగుంబెలో విచారణ చేస్తున్న పోలీసు అధికారులు!
ఏసీపీ దుర్గప్ప నేతృత్వంలోని ప్రత్యేక బృందం పోలీసులు మహేష్ ను కట్టుదిట్టమైన బందోబస్తుతో శివమొగ్గ జిల్లాలోని అగుంబె ప్రాంతానికి తీసుకు వెళ్లారు. గత నాలుగు రోజుల నుండి అగుంబెలో మకాం వేసిన పోలీసులు మహేష్ స్నేహితులు, వారి బంధువులను విచారణ చేసి వివరాలు సేకరించారు.
ఆదివారం మహేష్ ను నక్సల్ పీడిత ప్రాంతం అయిన అగుంబెకి తీసుకు వెళ్లారు. మహేష్ తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. అతని ఇంటిలో ప్రస్తుతం ఎవరు ఉండటం లేదు. అయితే, కొద్ది రోజుల క్రితం వరకు మహేష్, అతని అక్క ఈ ఇంటిలో నివాసం ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలిందని తెలుస్తోంది.
మహేష్ ను తీసుకొని పోలీసులు అగుంబె వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు అతని ఇంటి దగ్గర పెద్ద సంఖ్యలో గుమికూడారు. విషయం పసిగట్టిన పోలీసులు అగుంబెలోని రహస్య ప్రాంతానికి మహేష్ ను తరలించి విచారణ చేస్తున్నారు. మహేష్ అత్యాధునిక పిస్తోల్ ఉపయోగించి గౌతమిని పొట్టన పెట్టుకున్నాడు.
నిత్యం నక్సల్స్ సంచరించే అగుంబె ప్రాంతానికి చెందిన మహేష్ గత రెండు సంవత్సరాల నుండి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అంతకు ముందు ఇతను అగుంబెలో ఏం చేసేవాడు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అని పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications