కొత్త ముఖ్యమంత్రి కరోనా పాజిటివ్: చెన్నై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
చెన్నై: పుదుచ్చేరి కొత్త ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. దీనితో ఆయన చెన్నైకి చేరుకున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన ఎన్ రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జ్ లెప్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆ మరుసటి రోజే రంగస్వామిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆయనకు ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. దీనితో ఆయన చెన్నైకి బయలుదేరి వచ్చారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు చెప్పారు. కరోనా తీవ్రత స్వల్పంగానే ఉందని పేర్కొన్నారు.

రంగస్వామికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో రాజ్‌భవన్‌లో కలకలం చెలరేగింది. తమిళిసై సౌందర రాజన్, ఇతర ఉద్యోగులు, సిబ్బంది వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా- పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే కూటమి ఇక్కడ ఓటమి పాలైంది. స్పష్టమైన మెజారిటీతో ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రంగస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి.