నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై ఊరట-భారత్ విజ్ఞప్తికి ఖతార్ కోర్టు ఓకే..
ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేస్తూ ఖతార్ లో దొరికిపోయిన 8 మంది భారత నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై కాస్త ఊరట లభించింది. వీరికి విధించిన మరణశిక్షపై సమీక్ష కోరుతూ భారత ప్రభుత్వం చేసిన అప్పీలును ఖతార్ కోర్టు అంగీకరించింది. దీనిపై త్వరోల విచారణ ప్రారంభం కానుంది. భారత్ అప్పీలు మేరకు వారి విడుదలకు ఖతార్ కోర్టు అంగీకరిస్తే నేవీ మాజీ సిబ్బంది క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చేందుకు వీలవుతుంది. వీరి రాక కోసం కుటుంబాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
గత నెలలో ఎనిమిది మంది మాజీ భారత నౌకాదళ సిబ్బందికి మరణశిక్ష విధింపుకు సంబంధించి భారత ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ఖతార్ కోర్టు గురువారం విచారణకు స్వీకరించిందని ప్రభుత్వ వర్ఘాలు ధృవీకరించాయి. తాము అప్పీల్‌ను అధ్యయనం చేస్తున్నామని, తదుపరి విచారణ త్వరలో ఉంటుందని ఖతార్ కోర్టు తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఖతార్‌లోని స్ధానిక కోర్టు దేశంలో ఏడాది పాటు నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందికి మరణశిక్ష విధించింది.

దీనిని తిరిగి సమీక్షించాలని కోరుతూ భారత విదేశాంగశాఖ ఖతార్ కోర్టులో అప్పీలు చేసింది. దీనిపై స్పందించిన ఖతార్ కోర్టు భారత విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంది. దీనిపై త్వరలో విచారణ జరుపుతామని ప్రకటించింది. భారత నేవీ సిబ్బందికి మరణశిక్ష విధిస్తూ గతంలో ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పును విదేశాంగశాఖ రహస్యంగా ఉంచుతోంది. అయితే వారిని విడిపించేందుకు మాత్రం తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయంపై ఖతార్ అధికారులతో కేంద్రం చర్చలు జరుపుతోందని, భారత పౌరులకు ప్రభుత్వం అన్ని చట్టపరమైన, కాన్సులర్ సహాయాన్ని అందజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
గతేడాది ఆగస్టులో ఖతార్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా పనిచేస్తున్నారనే అనుమానంతో ఎనిమిది మంది మాజీ భారత నేవీ అధికారులను ఖతార్ అదుపులోకి తీసుకుంది. భారత నేవీ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, నావికుడు రాగేష్‌లను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆగస్టులో అరెస్టు చేసింది. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. అభియోగాలు నిజమని తేలడంతో ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది.












Click it and Unblock the Notifications