రాహుల్‌కి ముస్లింల కంటే వాళ్లే ఎక్కువ: అజాంఖాన్
లక్నో: కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై సమాజ్‌వాది పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి అజాంఖాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముస్లీం బీద వర్గాల కంటే, రాహుల్ గాంధీకి స్వలింగ సంపర్కుల సంక్షేమమే ఎక్కువైందని అజాంఖాన్ ఆరోపించారు. ఆయన రాంపూర్‌లో మాట్లాడుతూ... ముజఫర్‌నగర్ అల్లర్లలో నిరాశ్రయులైన బాధితులకు రాహుల్ గాంధీ ఎలాంటి సహాయం అందించలేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అత్యధిక సంఖ్యలో మత కలహాలు చోటు చేసుకున్నాయని అజాంఖాన్ ఆరోపించారు. ఇది ఆ ప్రభుత్వం మిగిల్చిన విధ్వంసమేనని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మత హింస బిల్లును తొందరగా ఆమోదించాలని అజంఖాన్ డిమాండ్ చేశారు. జాట్ వర్గానికి రిజర్వేషన్లను ప్రకటించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వం, ముస్లింలకు ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. దేశంలో ముస్లింలు దళితులకంటే దీన స్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు.
తాను జాట్లకు ఇస్తున్న రిజర్వేషన్లను తప్పు పట్టడం లేదనీ, అయితే దేశంలో అత్యధికులుగా ఉన్న మైనార్టీ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు. వారికి రిజర్వేషన్లు అవసరమని తెలిపారు. ఎవరైతే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారో వారికి రిజర్వేషన్లలో ప్రాధాన్యత కల్పించాలని అజాంఖాన్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications