Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ధైర్యం చాలట్లేదా.. రాహులా?

దేశంలో మరో ఎన్నికల స్టంట్ కు తెర తీశారు.. కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. దేశ ఎన్నికల వ్యవస్థ విచ్ఛిన్నమైందని, అవినీతిమయమైందని, ప్రతిపక్షాలకు అన్యాయం చేసిందని ఆయన ఆరోపిస్తోన్నారు. ఆయన ప్రసంగాలు ప్రజల్లో ఆగ్రహాన్ని రెచ్చగొట్టేలా ఉంటోన్నాయే తప్ప ఆలోచన రేకెత్తించట్లేదు.

రాహుల్ మాటల్లో వాస్తవం ఎంత వరకు ఉందనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. వాటిని నిశితంగా పరిశీలిస్తే అవి అబద్ధాల పుట్టగా తేలుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్యలో అనూహ్య పెరుగుదలపై ఆయన విమర్శలు గుప్పించారు మొన్నీ మధ్యే.

Rahul Gandhi

గతంలో ఆయన కాంగ్రెస్ పాలనలో కూడా ఇలాంటి ట్రెండ్‌లు కనిపించినట్లు ఎన్నికల డేటా చెబుతోంది. అయినప్పటికీ- వాటిని ఆయన పట్టించుకోవట్లేదు. పైగా రాహుల్ గాంధీ తన ఆరోపణలపై అధికారికంగా ఫిర్యాదు చేయడానికి గానీ లేదా న్యాయపరమైన చర్యలకు గానీ ముందుకు రాకపోవడం అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఎన్నికల యంత్రాంగం రాజీ పడిందని, ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు ఉన్నాయని, ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా కాకుండా పాలకపక్షానికి వత్తాసు పలుకుతోందని రాహుల్ గాంధీ నెలల తరబడి దేశాన్ని, దేశ ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తోన్నారు. సోషల్ మీడియాలో నిరంతరం ప్రసారమయ్యే ఆయన ప్రసంగాలు చూస్తోంటే.. దేశ ప్రజాస్వామ్యం పతనం అంచున ఉందని భయాందోళనలు రేకెత్తించకమానవు.

వాస్తవాలు తెరపైకి వచ్చినప్పుడు అది ఆ భావోద్వేగాలనేవి ఛప్పున చల్లారుతున్నాయి. ఫలితంగా- రాహుల్ చేసిన ప్రస్తావనలు, ప్రసంగాలపై సందేహాలు రేకెత్తిస్తోన్నాయి. రాహుల్ ప్రధాన ఫిర్యాదు- ఓటర్ల సంఖ్యలో అనుమానాస్పద పెరుగుదల. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఈ పెరుగుదల చోటు చేసుకుందనేది ఆరోపణ.

Rahul Maharashtra

మహారాష్ట్రలో సార్వత్రిక-, అసెంబ్లీ ఎన్నికల మధ్య నమోదైన ఓటర్లలో 4.4% పెరుగుదలను రుజువుగా చూపుతున్నారాయన. చారిత్రక రికార్డులు ఆయన కథనానికి సరిపోలడం లేదు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు- ఈ పెరుగుదల 4.7%గా ఉంది. 2009లో ఇది 4.1%గా నమోదైంది.

రాహుల్ గాంధీ విమర్శిస్తున్న 2024 నాటి గణాంకాలు నాటి ఓట్ల శాతం పెరుగుదలకు అనుగుణంగా ఉండటమే కాకుండా, ఆయన సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటి కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. ఎన్నికల అధికారులు ఈ విధమైన పెరుగుదల సాధారణమని వివరిస్తున్నారు.

నిరంతర ఓటర్ల నమోదు ప్రక్రియ, ధృవీకరణ, చట్టం ద్వారా నిర్దేశించిన సవరణల ఫలితమే ఇది.. ఈ పెరుగుదల. రాహుల్ గాంధీ ఆరోపణ మరింత గందరగోళంగా మారడానికి కారణం లేకపోలేదు. మహారాష్ట్రలోని ప్రతి కాంగ్రెస్ బూత్ ఏజెంట్ పోలింగ్ ముగిసిన తర్వాత ఫారం 17Cపై సంతకం చేసి, ఎటువంటి అభ్యంతరం లేకుండా ఓట్ల లెక్కింపును ధృవీకరించారు.

ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ ఆయన పార్టీ ఒక్క ఎన్నికల పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. గాంధీ వాదిస్తున్నట్లుగా ఈ పెరుగుదల నిజంగానే చోటు చేసుకునివుంటే.. ప్రెస్‌మీట్ల వద్దే ఆయన ఎందుకు ఆగిపోవాలి? న్యాయస్థానాల్లో ఎందుకు పోరాటం చేయకూడదు?.

రాహుల్ చెప్పిన కర్ణాటక ఉదాహరణ కూడా లోపభూయిష్టమే. ఓటర్ల జాబితాలో అవినీతికి రుజువుగా బెంగళూరులోని మహాదేవపుర నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. కానీ డేటా వేరే కథ చెబుతోంది. అక్కడ బీజేపీ విజయాలు బెంగళూరు సెంట్రల్‌లోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ ట్రెండ్ లో ఓ భాగం.

శివాజీ నగర్, చామరాజ్‌పేట్ వంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ కంచుకోటలు. మైనారిటీ ఓటు బ్యాంక్ అధికం అక్కడ. మైనారిటీల ఆధిపత్య నియోజకవర్గాల్లో నకిలీ ఓటర్ల నమోదులు, ఇంటినంబర్లు లేకపోవడం, ఓటింగ్‌లో ఊహించని పెరుగుదలకు కారణం అయ్యాయి.

మహారాష్ట్రలోని మాలెగావ్ సెంట్రల్ నియోజకవర్గంలో 90% పైగా మైనారిటీ జనాభా ఉంది. 2024లో ఇక్కడ ఓటింగ్‌ శాతం అసాధారణంగా 43.51% పెరిగింది. జాబితాలోని 9,700 మందికి పైగా ఓటర్లకు పూర్తి చిరునామా వివరాలు లేవు. మిగిలిన అయిదు నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఈ ఒక్క అసెంబ్లీ స్థానం.. ధూలే లోక్‌సభ ఫలితాన్ని తారుమారు చేసింది.

కాంగ్రెస్ గెలిచినప్పుడు- అంటే జార్ఖండ్ లేదా జమ్మూ కాశ్మీర్‌లలో తరహాలో ఎన్నికల ప్రక్రియ న్యాయబద్ధమైనదని, ప్రజలు నిష్పక్షపాతంగా ఓటు వేశారని ఏ రాహుల్ గాంధీ అయితే ప్రశంసిస్తోన్నాడో.. అదే రాహుల్ గాంధీ మహారాష్ట్ర లేదా హర్యానాలో బీజేపీ గెలిచినప్పుడు, అదే ఓటింగ్ ప్రక్రియ ప్రజాస్వామ్య పతనానికి రుజువుగా విమర్శించడం అర్థరహితమని విశ్లేషకులు విమర్శిస్తోన్నారు.

ఈ 'హెడ్స్ ఐ విన్, టెయిల్స్ యూ లూస్' అనే వైఖరి రాహుల్ గాంధీ రాజకీయ ద్వంద్వనీతికి అద్దం పడుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా తనను తాను ప్రకటించుకునే వారి నుండి స్థిరత్వాన్ని ఆశించే వారిలో ఆయన విశ్వసనీయతను దెబ్బతీస్తోంది.

తన వాదనలను అఫిడవిట్‌ ద్వారా లేదా అధికారికంగా ఫిర్యాదు చేయడం ద్వారా నిరూపించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ పదేపదే రాహుల్ గాంధీని సవాలు చేసింది. అలా చేస్తే ఆయన వాదనలకు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చట్టబద్ధమైన హోదాను ఇస్తాయి. ఆ ఆరోపణలు అబద్ధమని రుజువైతే భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఆయనకు జరిమానాలు కూడా విధిస్తాయి.

అఫిడవిట్ ఇవ్వడాన్ని రాహుల్ గాంధీ ఇప్పటివరకు నిరాకరిస్తూ వస్తోన్నారు. ర్యాలీలు, మీడియా ఇంటర్వ్యూల్లో మాత్రమే ఆయన పోరాటాన్ని కొనసాగించడానికి ఇష్టపడ్డారే తప్ప.. చట్టాలు, న్యాయవ్యవస్థల్లో కాదనేది ఇక్కడ స్పష్టమౌతోంది. ఆయన అనుసరిస్తోన్న విధానం చట్టబద్ధమైనది కాకుండా రాజకీయపరమైనది. విమర్శకులు దీనిని 'షూట్-అండ్-స్కూట్' విధానం అని పిలుస్తారు.

Rahul operandi

ఓట్ చోరీపై ఆయన ప్రచారం దేశీయ స్థాయికి మాత్రమే పరిమితం కాలేదు. తన ఆరోపణలను విదేశాలకు సైతం తీసుకువెళ్లారు. భారత ప్రజాస్వామ్యంపై విదేశీయులకు కూడా అనుమానాలను రేకెత్తించేలా చేయడాన్ని తనకు అలవాటుగా మార్చుకున్నారు. స్వదేశంలో ఒక వాదనను లేవనెత్తడం, దానిని సానుభూతిగల అంతర్జాతీయ మీడియాలో విస్తరించడం, ఆపై అదే నివేదికలను భారత్ లో ఉదహరించడం ఓ అలవాటుగా మారిందాయనకు.

ఈ ఫీడ్‌బ్యాక్ లూప్ అనేది- ప్రపంచం ఏకాభిప్రాయంలోనే ఉందనే భ్రాంతిని సృష్టిస్తుంది. ఆయన ఆరోపణలకు లేని విశ్వసనీయతను ఇస్తుంది. ఈ వ్యూహం ఇతర దేశాలలో ఉపయోగించిన ఓ రంగుల విప్లవ వ్యూహాలను పోలి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక్కడ ప్రతిపక్ష ఉద్యమాలు, వీధి పోరాటాలు, అంతర్జాతీయ ఒత్తిడి.. ఇవన్నీ కలిపి ఎన్నికైన ప్రభుత్వాలను బలహీనపరుస్తాయి. బీహార్ వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తోన్న సిస్టమేటిక్ ఓటర్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటికేషన్ (SIR) ప్రక్రియ ద్వారా 65 లక్షలకు పైగా బోగస్ ఎంట్రీలు వెలుగులోకి వచ్చాయి. మరణించిన ఓటర్లు, వలస వెళ్లిన ప్రజలు, నకిలీలను తొలగించింది ఈసీ.

బీహార్‌లో.. ఈ తొలగింపులపై ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా అభ్యంతరాలు దాఖలు చేయలేదు. కేరళలో.. అంతర్గత ఆడిట్‌లు 6.25 లక్షలకు పైగా బోగస్ ఓటర్లను, 2.7 లక్షలకు పైగా ఒకే వ్యక్తులకు కేటాయించిన బహుళ ఐడీలను, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటు వేసిన పదుల కేసులను గుర్తించారు.

ఈ అక్రమాలలో కొన్ని గాంధీ సొంత నియోజకవర్గమైన వాయనాడ్‌లో కూడా ఉన్నాయి. ఎన్నికల సమగ్రతకు ఛాంపియన్‌గా తనను తాను నిలబెట్టుకునే నాయకుడికి ఈ వాస్తవం.. చేదను కలిగించేదే. SIR ప్రక్రియకు వ్యతిరేకత కాంగ్రెస్ వ్యూహంలో ఓ భాగం మాత్రమేనని విమర్శకులు చెబుతున్నారు. దీనికి కారణం ఓటరు హక్కులను కాపాడటం కంటే రాజకీయ లెక్కలను సరి చేయడానికేనని అంటున్నారు.

కేంద్రీకృత, నమ్మకమైన ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గాలు.. ప్రత్యేకించి మైనారిటీలు ఎక్కువగా ఉన్న పట్టణాలు, గట్టి పోటీ ఉన్న స్థానాల్లో విజయాన్ని తారుమారు చేయగలవు. ధూలే, మాలెగావ్ సెంట్రల్, బెంగళూరు లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇటువంటి ఓటింగ్ సరళి ద్వారా మాత్రమే కాంగ్రెస్ విజయాలను సాధిస్తోంది.

రాజకీయ సంక్షోభాలను సృష్టించే విధానం రాహుల్ గాంధీకి కొత్తేమీ కాదు. CAA వ్యతిరేక నిరసనలు, రైతుల ఆందోళన, వక్ఫ్ చట్టం నిరసనలు - ప్రతిదీ ఓ నైతిక యుద్ధంగా చిత్రీకరించారాయన. అయినప్పటికీ- అవేవీ కూడా మెజారిటీ ప్రజల దృష్టిలో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయగల దేశవ్యాప్త చీలికను తీసుకురాలేకపోయాయి.

రాజకీయ వాతావరణాన్ని నిరంతరం ఉద్రిక్తంగా ఉంచడం, పాలక పక్షాన్ని నిరంతరం దుమ్మెత్తిపోస్తోండటం, ఏదేదో జరిగిపోతున్నట్లు చిత్రీకరించడం, అస్థిత్వానికి ముప్పు తెచ్చేవిధంగా మార్చడం.. రాహుల్ గాంధీ అలవాటేనని విమర్శకులు తేల్చి చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీనే ఇలాంటి అస్థిత్వ ముప్పు సూత్రాన్ని ఖచ్చితత్వంతో అమలు చేస్తుంటుంది. ఆ పార్టీ నాయకులు అసమ్మతిని సహించరు. కర్ణాటక మంత్రి కెఎన్ రాజన్న.. షెడ్యూల్డ్ తెగల నేపథ్యం నుండి వచ్చిన నాయకుడు. ఎన్నికల మోసం గురించి గాంధీ వాదనలను బహిరంగంగా ప్రశ్నించిన తర్వాత తన పదవిని కోల్పోయారు.

Rahul fake narrative

బహిరంగ చర్చ, ప్రజాస్వామ్య ఆదర్శాలకు ఛాంపియన్‌గా తనను తాను ఆవిష్కరించుకునే నాయకుడికి.. అంతర్గత వ్యవహారాలను ప్రశ్నించే తత్వాన్ని సహించకపోవడం ఇబ్బందికరంగానే ఉంటుంది. భారత్ జోడో యాత్ర కూడా ఇటువంటి ప్రశ్నల నుండి తప్పించుకోలేదు.

విదేశీ నిధులతో కూడిన NGOలు, USAIDతో సంబంధం ఉన్న సంస్థలు కూడా క్రియాశీలంగా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాయనే వార్తలు రావడం ఆశ్చర్యాన్ని కలిగించాయి. స్థానిక క్రియాశీలత, ప్రపంచ లాబీయింగ్ మధ్య సరిహద్దు నానాటికీ అస్పష్టంగా మారుతున్న ఈ కాలంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి జరిగిన ఈ రాహుల్ ప్రచారంలో విదేశీ- దాని సంబంధిత సంస్థల పాత్ర రాజకీయంగా శక్తివంతమైనది.. ప్రమాదకరమైనవీ.

సంస్థలను సంస్కరించడంపై కాకుండా వాటిపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడంపై రాహుల్ గాంధీ నిర్మించిన రాజకీయ వ్యూహమే ఇది. ఈ ప్రక్రియ ఊహించిందే. ఓటుపై అనుమానం కలిగించండం, రెఫరీని పక్షపాతంగా చిత్రీకరించండం, పరిపాలనా లోపాలను కుట్రకు రుజువులుగా చూపించడం అనేది ఆయన వ్యూహాల్లో కీలక భాగాలుగా మారాయి.

గాంధీకి తన కేసును నిరూపించుకోవడానికి పిటిషన్ల నుండి అఫిడవిట్‌ల వరకు ఎన్నికల వ్యవస్థలు అనేక అవకాశాలు ఇచ్చాయి. ఆయన వాటిని వినియోగించుకోవట్లేదు. కోర్టులో రాహుల్ గాంధీ తన పోరాటాన్ని కొనసాగించాలని ఆశించినప్పటికీ ఇక్కడ తీర్పులు చట్టం ద్వారా కాకుండా చప్పట్లు, హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా ఇచ్చారు.

భారత్ వంటి విశాలమైన, విభిన్న దేశంలో.. ఎన్నికలు అనేవి కోట్లాదిమంది ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ఓ ప్రక్రియ. దాన్ని తన అంతులేని రాజకీయ నాటకంలో మరో స్టేజ్ ప్రాప్‌గా పరిగణించాలనుకుంటే అది వ్యవస్థను నడిపే నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. అలాంటి నమ్మకం సడిలితే ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని విశ్లేషకులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+