మోదీ 20 సార్లు వచ్చారు.. ఏం ఒరగబెట్టారు: మా నెక్స్ట్ టార్గెట్ అదే- సిద్ధు సంచలనం
బెంగళూరు: అత్యంత ఉత్కంఠత రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్‌కు అనుకూలంగా వెలువడుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని కాంగ్రెస్ అందుకుంది. తాజా సమాచారం ప్రకారం- 135 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇందులో పలు నియోజకవర్గాల్లో విజయం సాధించారు.
నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీజేపీ 64 నియోజకవర్గాలకే పరిమితమైంది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్) బాగా నష్టపోయింది. తన కంచుకోటలను ప్రత్యర్థి పార్టీలకు కోల్పోయింది. రామనగరలో కుమారస్వామి కొడుకు, ప్రముఖ నటుడు నిఖిల్ కుమారస్వామి సైతం ఓడిపోయారు.

గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే 16 స్థానాలను జేడీఎస్ కోల్పోయింది. ప్రస్తుతం 22 నియోజకవర్గాల్లో జేడీఎస్ ఆధిక్యతలో ఉంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 113 స్థానాలు అవసరం. ఈ మార్క్‌ను అందుకుంది కాంగ్రెస్. ఈ విజయం పట్ల ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.
వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిద్ధరామయ్య భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి వీ సోమన్నను మట్టికరిపించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు.

ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ 20 సార్లు కర్ణాటకలో పర్యటించారని, ఏ ప్రధాని కూడా ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఇంతలా ప్రచారం చేసిన సందర్భాలు లేవని సిద్ధరామయ్య అన్నారు. అయినప్పటికీ బీజేపీకి ఓటమి తప్పలేదని చెప్పారు. 40 శాతం కమీషన్ల కోసం బీజేపీ ప్రభుత్వం ప్రజలను వేధించిందని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారిపై సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తూ- నిరంకుశంగా బీజేపీ పరిపాలన సాగించిందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకుందని అన్నారు.
ఇక తమ తరువాతి లక్ష్యం- రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడమేనని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. తాము సాధించిన ఈ గెలుపుతో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమౌతాయని, దేశవ్యాప్తంగా బీజేపీ పతనం తప్పదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలంటూ బీజేపీయేతర పార్టీలకు తాను విజ్ఞప్తి చేస్తోన్నానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications