Rahul Gandhi: వాయనాడ్, రాయ్ బరేలీలో రాహుల్ కొనసాగేది ఇక్కడే..! కీలక కారణాలు..
కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ ఈసారి తాను పోటీ చేసిన వాయనాడ్, రాయ్ బరేలీ సీట్లలో గెలిచారు. గత ఎన్నికల్లో అమేథీలో ఎదురైన పరాజయం తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేసిన రాహుల్ గాంధీ గతంలో గెలిచిన వాయనాడ్ సీటులో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత తమ కుటుంబ కంచుకోట రాయ్ బరేలీలో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ రెండు చోట్లా ఓటర్లు ఆయన్ను గెలిపించారు.
దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ రెండు సీట్లలో ఒకదాన్ని తప్పనిసరిగా వదులుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. దీనిపై తాజాగా స్పందించిన రాహుల్ .. తనను గెలిపించిన రాయ్ బరేలీ, వాయనాడ్ రెండూ తనకు సమానమేనని చెప్పుకొచ్చారు. ఏ సీటునూ వదులుకోవాలని భావించడం లేదన్నారు. కానీ నిబంధనల ప్రకారం ఒక సీటులో మాత్రమే కొనసాగాల్సిన పరిస్ధితుల్లో రాయ్ బరేలీని ఉంచుకుని, వాయనాడ్ సీటుకు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.

చాలాకాలం తర్వాత ఈసారి ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు తెచ్చుకుంది. ఒకప్పుడు దశాబ్దాల పాటు యూపీని ఏలిన కాంగ్రెస్ పార్టీ పతనమైన తర్వాత తిరిగి పుంజుకోవడం ఇదే తొలిసారి. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీతో కలిసి కాంగ్రెస్ అనుసరించిన దళిత, మైనార్టీ, బీసీ వ్యూహం ఫలించింది. దీంతో ఏకంగా 80కి 43 సీట్లలో కాంగ్రెస్, సమాజ్ వాదీతో కూడిన ఇండీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో బీజేపీ 33 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జోరు కొనసాగాలంటే రాహుల్ రాయ్ బరేలీలో కొనసాగడమే మంచిదన్న పార్టీ నేతల సూచన మేరకు ఆయన వాయనాడ్ ను వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications