ముంబై లోకల్ రైలు నుంచి కిందపడి 5గురి మృత్యువాత.. రైల్వే కీలక నిర్ణయం..!
ముంబైలోని దివా-ముంబ్రా స్టేషన్ల మధ్య ప్రయాణించే ఓ స్థానిక సబర్బన్ రైలు నుంచి కింద పడి తాజాగా ఐదుగురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. రద్దీగా ఉన్న రైల్లో డోర్ వద్ద నిలబడిన వీరంతా ప్రయాణం సమయంలో కింద పడి చనిపోయారు. దీంతో ఈ ఘటన రైల్వేను ఆలోచనలలో పడేసింది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై ఘటన నేర్పని పాఠంతో ఇకపై రైలు పెట్టెల తయారీలో కీలక మార్పు చేయాలని నిర్ణయించింది.
ముంబై సబరన్ నెట్ వర్క్ లో ప్రయాణించే అన్ని రైళ్ల కోచ్ లనూ ఇకపై ఆటోమేటిక్ డోర్ క్లోజర్ సిస్టమ్ తో తయారు చేయాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ప్రయాణించే వారు స్టేషన్ల మధ్యలో పడిపోకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడనుంది. తాజాగా ముంబైలోని ఓ సబర్బన్ రైలులో రద్దీ ఎక్కువగా ఉండటంతో అలాగే డోర్లకు వేలాడుతూ ప్రయాణిస్తూ ఐదుగురు చనిపోవడం, మరికొంతమంది గాయపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.

అంతే కాదు ఇప్పటికే నడుస్తున్న ముంబై సబర్బన్ రైళ్లలోనూ ప్రయాణికులు అదుపుతప్పి కిందపడి పోకుండా ఉండేందుకు వీలుగా కోచ్ లను రీడిజైన్ చేయబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటిలోనూ ఆటోమేటిక్ డోర్ క్లోజర్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు థానే సబర్బన్ రైలు ప్రమాదంలో మొత్తం 13 మంది కదులుతున్న రైలు నుంచి కింద పడినట్లు దర్యాప్తులో తేలింది. వీరిలో ఐదుగురు చనిపోగా.. మిగతా వారికి గాయాలు కావడంతో ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విమర్శలు రావడంతో రైల్వేశాఖ వెంటవెంటనే చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications