భారీవర్షాలతో తమిళనాడు విలవిల- చెన్నైలో వర్ష బీభత్సం-విద్యాసంస్ధల మూసివేత..
బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడన ద్రోణి కారణంగా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే క్రమంలో నిన్న అర్దరాత్రి పలు ప్రాంతాల్ని వాన ముంచెత్తింది. రాత్రి నుంచి నిరంతరం కురుస్తున్న వర్షాలతో చెన్నై మహానగరంలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు తప్పవన్న హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకు పైగా పునరావాస శిబిరాల్ని ఏర్పాటు చేసి జనాన్ని తరలిస్తున్నారు. ఇందులో ఒక్క చెన్నై నగరంలోనే 169 క్యాంపులు ఏర్పాటు చేశారు.
చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో జనాన్ని వర్షాల నుంచి రక్షించేందుకు ఎస్టీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు 2 వేల మందికి పైగా సహాయక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైతో పాటు తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట, వెల్లూరు, సాలెం, నమక్కల్, తిరువణ్ణామలై, కల్లకురుచ్చి, రామనాధపురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇందులో రాణిపేట, తిరువల్లూరు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ప్రస్తుతం తమిళనాడు-పుదుచ్చేరి మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ద్రోణి రేపు తీరం దాటవచ్చని తెలుస్తోంది. దీంతో రాబోయే 48 గంటల పాటు వర్షాల బెడద తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ జనాన్ని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అధికారులతో సీఎం స్టాలిన్ వరుస రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా ప్రాణనష్టం లేకుండా చూడాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications