తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు: రేపట్నుంచి వర్షాలు
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్న సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ(Weather) శాఖ సూచనలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మార్చి 16 నుంచి వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో మార్చి 16 నుంచి 21 వరకు వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు, మార్చి 20, 21 తేదీల్లో జమ్మూకాశ్మీర్, లడఖ్‌లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. కాగా, గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచే సూరీడు మండిపోతున్నాడు. దీంతో ఎండవేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఉదయం 9 గంటల తర్వాత నుంచి సాయంత్రం వరకు బయటకు రావాలంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇక ఇళ్లల్లో ఉండేవారంతా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలకు పనిచెబుతున్నారు. కాగా, తీవ్రమైన ఎండల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు ఒంటిపూట బడులను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications