జాక్ పాట్ కొట్టిన భారత్.. భారీగా బయటపడ్డ చమురు నిక్షేపాలు.. 19 బావుల్లో..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ అక్కడి పరిస్థితి యుద్ధ వాతావరణాన్నే తలపిస్తోంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ దాడులపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఇరాన్ హర్మూజ్ జలసంధిని మరోసారి మూసేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలకు భారీ షాక్ తగిలింది. హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసి వేసిన నేపథ్యంలో అక్కడి వరకూ వెళ్లిన నౌకలను తిరిగి బలవంతంగా వెనక్కు మరలిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి.
పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో భారత్ లోనూ చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు అయితే దేశ ప్రజలకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. కానీ భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో భారత్ కు జాక్ పాట్ తగిలింది. దేశంలోనే అత్యధికంగా పెట్రోలియం లభ్యమయ్యే రాష్ట్రంగా పేరుగాంచిన రాజస్థాన్ లో భారీగా చమురు నిక్షేపాలు బయట పడ్డాయి. 19 బావుల ద్వారా రోజూ దాదాపు 1,202 బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎంతో కొంత భారత్ పై ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ఆర్థికంగా మరింత శక్తివంతంగా మారే సమయం వచ్చింది. తాజాగా రాజస్థాన్ లోని థార్ ఎడారి ప్రాంతంలో భారీగా చమురు నిక్షేపాలు బయట పడ్డాయి. దాంతో ముడి చమురు ఉత్పత్తిని భారత్ భారీగా పెంచింది. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలోని భాగేవాలా ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ మేరకు ముడి చమురు ఉత్పత్తిని గణనీయంగా పెంచేసినట్లు సమాచారం.

ఈ ప్రాంతంలో గతేడాది 707 బ్యారెల్స్ చమురు ఉత్పత్తి అయింది. అయితే ప్రస్తుతం 1200 లకు పైగా బ్యారెల్స్ ఉత్పత్తి అవుతోంది. అంటే కొద్ది నెలల్లోనే దాదాపు 70 శాతం ఉత్పత్తి పెరిగింది. భారీగా చమరు నిక్షేపాలు బయటపడడంతోనే ఇది సాధ్యం అయింది. ఇక ప్రస్తుతం ఈ ప్రాంతంలో 19 బావుల ద్వారా ఉత్పత్తి సాగుతోంది. అలాగే మరో 13 కొత్త బావులను తవ్వి టెస్టింగ్ చేస్తున్నారు. ఓ వైపు హార్మూజ్ జలసంధి మూసివేసిన నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత లేకుండా చమరు నిక్షేపాలు బయటపడడం భారత్ కు జాక్ పాట్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications