• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ranchi Violence: రాంచీలో హింస ఎలా మొదలైంది? పోలీసులు ఎందుకు కాల్పులు జరిపారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పోలీసు

మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ జూన్ 10న జార్ఖండ్‌ రాజధాని రాంచీలో జరిగిన ర్యాలీ సందర్భంగా హింస చెలరేగింది. దీనికి సంబంధించిన పలు వీడియో క్లిప్‌లు వైరల్‌ అయ్యాయి.

ఆ వీడియోల్లో ఒక నిరాయుధుడైన యువకుడు రోడ్డుపై ఒంటరిగా నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆయనను అనుసరిస్తున్న కొందరు ఇస్లాం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

ఆయన మహాత్మా గాంధీ మార్గ్ (మెయిన్ రోడ్) డివైడర్‌ దగ్గరకు వచ్చాక.. తలకు బుల్లెట్ తగిలి పడిపోయారు. ఆయనను అనుసరిస్తున్న కొందరు యువకులు వచ్చి చనిపోయారు.. చనిపోయారు అంటూ కేకలు వేశారు.

ఆయన 15 ఏళ్ల ముదాసిర్ అని ఆ సాయంత్రానికి వార్తలు వ్యాపించాయి. ఆయన హింద్ పిడిలోని రైన్ ప్రాంతంలో నివసించే పర్వేజ్ ఆలం ఏకైక కుమారుడు. ఆ యువకుడిని చికిత్స నిమిత్తం రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయారు.

రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్న 24 సంవత్సరాల సాహిల్ కూడా అదే రాత్రి చనిపోయారు. ఆ రాత్రే ఆ యువకుడికి పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

10 మందికి గాయాలు

రాంచీలో చెలరేగిన హింసలో కాల్పులకు గురైన 10 మందిలో వీరిద్దరూ కూడా ఉన్నారు.

రిమ్స్ నుంచి బీబీసీ సేకరించిన నివేదికలో, చాలా మందికి బుల్లెట్ గాయాలైనట్లు వైద్యులు నిర్ధరించారు. వారంతా రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వారిలో సర్ ఫరాజ్ , తబారక్, ఉస్మాన్, అఫ్సర్, సాబీర్, షాబాజ్‌లు మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. వీరంతా 15 నుంచి 30 ఏళ్ల లోపు వారే.

ఒక పోలీసుకు కూడా బుల్లెట్ గాయమైనట్లు జార్ఖండ్ పోలీసు ప్రతినిధి ఏవీ హోంకర్ చెప్పారు. గాయపడిన ఆ పోలీసును రిమ్స్‌లోని ఎర్త్‌ వార్డ్‌లో ఉంచారు.

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 10 (శుక్రవారం) మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ముస్లింలు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు.

వీరిలో కొందరి చేతుల్లో మతపరమైన జెండాలు ఉండగా, మరికొందరు నల్లజెండాలు పట్టుకున్నారు. హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ జరిగింది.

ఆ తర్వాత ర్యాలీలో పాల్గొన్న కొందరు హనుమాన్ గుడిపై రాళ్లు విసరడం ప్రారంభించారని ఆరోపించారు. ర్యాలీలో పాల్గొన్న కొందరు నేతలు తమ సహచరులను వెనక్కి రావాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, ఎవరూ పట్టించుకోలేదు.

పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో, గుంపులో ఉన్న వ్యక్తులు దాడులను తీవ్రతరం చేశారు.

రాళ్లదాడిలో పోలీస్‌స్టేషన్‌ అధికారికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎస్‌ఎస్పీతో పాటు పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ హింసాకాండలో గాయపడిన 24 మందిలో 12 మంది పోలీసులున్నట్లు అధికారులు తెలిపారు.

ర్యాలీకి ఎవరు పిలుపునిచ్చారు?

ర్యాలీ ఆకస్మికంగా జరిగిందని అంజుమన్ ఇస్లామియా అవుట్‌గోయింగ్ సదర్ చీఫ్ అబ్రార్ అహ్మద్ బీబీసీకి తెలిపారు. ఈ ఊరేగింపుకు ఎవరు పిలుపునిచ్చారో తెలియదన్నారు.

''గతంలో మతపరమైన ప్రదర్శనలు ఎప్పుడు చేసినా పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చేవాళ్ళం. గతంలో ప్రదర్శనలు ఎప్పుడూ హింసాత్మకంగా మారలేదు. ఇక్కడ ఎప్పుడూ శాంతియుత వాతావరణం ఉంటుంది. వివాదాలన్నిటినీ శాంతియుతంగా చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాం. ఇంత స్థాయిలో హింస జరిగి ప్రాణాలు పోవడం ఇదే మొదటిసారి" అని ఆయన అన్నారు.

ర్యాలీ గురించి పోలీసులకు తెలుసా?

ఈ ర్యాలీ గురించి తమకు ముందస్తు సమాచారం ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అయితే, ర్యాలీ జరగడానికి గంట ముందు, పోలీసులు అదే రహదారిపై ఫ్లాగ్ మార్చ్ చేశారు.

అయితే, తమ షాపులను మూసి ఉంచాలని మార్కెట్ దుకాణదారుల సంఘం ముందుగానే ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుంచి వారి దుకాణాలు మూసేశారు. ఇది హోల్‌సేల్ పండ్ల మార్కెట్. ఇక్కడ ఎక్కువ షాపులు ముస్లింలకు చెందినవే.

పోలీసులు కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది?

రాంచీలో జరిగిన హింసకు సంబంధించి ఆదివారం రాంచీ డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఛవీ రంజన్, ఎస్ఎస్పీ సురేంద్ర కుమార్ ఝా విలేఖరుల సమావేశం నిర్వహించారు. పోలీసులు కాల్పులు జరపడం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమని వారు వివరించారు. ముందుగా జాగ్రత్తలు తీసుకున్నామని, తర్వాత కాల్పులు జరపాలని నిర్ణయించుకున్నామని డీసీ తెలిపారు.

ఎస్ఎస్పీ సురేంద్ర కుమార్ ఝా మీడియాతో మాట్లాడుతూ, "మేము ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మాకు శిక్షణ ఇచ్చారు. నగరంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. మాకిచ్చిన శిక్షణకు అనుగుణంగానే కాల్పులు జరపాలని నిర్ణయం తీసుకున్నాం. దీంతో పెను విషాదం తప్పింది" అని అన్నారు.

కాల్పులకు ముందు పోలీసులు బాష్పవాయు గోళాలు కానీ, వాటర్ క్యానన్లను కానీ ప్రయోగించలేదు. సాధారణంగా ఆవేశంతో ఉన్న గుంపులను చెదరగొట్టేందుకు వీటిని ప్రయోగిస్తారు.

శుక్రవారం జరిగిన హింస సమయంలో పోలీసులు బాష్పవాయువు, వాటర్ క్యానన్లు ఏర్పాటు చేశారా? ఆందోళనకారులను లౌడ్ స్పీకర్ల ద్వారా హెచ్చరించారా? అని విలేఖరులు అడగ్గా.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు.

హెచ్చరికలు లేకుండా కాల్పులు జరపడం సమంజసమేనా?

రాంచీ పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారని జార్ఖండ్‌, బీహార్‌లో కీలక బాధ్యలు నిర్వహించిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ రామచంద్ర రామ్‌ అన్నారు.

"ఆ గుంపు హింసాత్మకంగా మారి, వేరే దారి లేనప్పుడు పోలీసులు ఏం చేస్తారు.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సరైన నిర్ణయం తీసుకున్నారు. వీడియోల్లో రాంచీ పోలీసుల చర్య చూస్తే సమర్థనీయంగానే అనిపించింది. ఆ గుంపు చాలా హింసాత్మకంగా ఉంది" అని అన్నారు.

అయితే, ప్రముఖ సామాజిక కార్యకర్త నదీమ్ ఖాన్ మాత్రం ఈ అభిప్రాయంతో విబేధించారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "పోలీసులు ఎప్పుడూ నేరుగా కాల్పులు జరపరు. మొదట, శాంతియుతంగా సాగుతున్న ర్యాలీలో నిరసనకారులు ఎందుకు హింసాత్మకంగా మారారనేది విచారణలో తేలాల్సి ఉంది. రెండవది, పోలీసులకు ఈ ప్రదర్శన గురించి తెలిసిన వెంటనే వాటర్ క్యానన్, రబ్బరు బుల్లెట్, టియర్ గ్యాస్ లేదా లాఠీ ఛార్జ్ వంటి చర్యలను ఎందుకు ప్రయత్నించలేదు?" అని ప్రశ్నించారు.

"శుక్రవారం ఉదయం డైలీ మార్కెట్ స్టేషన్ ఇన్‌చార్జి దుకాణదారులతో సమావేశమై, షాపులను మూసివేయండి, కానీ ఎలాంటి ప్రదర్శన, ధర్నా నిర్వహించవద్దని చెప్పినట్లు నాకు సమాచారం ఉంది. వారు షాపులను మాత్రమే మూసి ఉంచుతామని హామీ ఇచ్చారు. అప్పుడే పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సింది. ఈ ప్రదర్శనకు సంబంధించిన వార్తలు కూడా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందుకే ఇదంతా హఠాత్తుగా జరిగిందని పోలీసులు చెప్పలేకపోతున్నారు. ప్రజలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపారు. చాలా మందికి శరీరం పై భాగంలో బుల్లెట్లు తగిలాయి. అలాంటి పరిస్థితుల్లో పోలీసులపై మతపరమైన విభజన ప్రభావం ఏమైనా ఉందేమోనని అనుమానంగా ఉంది.’’ అని నదీమ్ అన్నారు.

ప్రభుత్వ వైఫల్యం

ఈ మొత్తం ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు బాబులాల్ మరాండీ అన్నారు.

"రాంచీలో జరిగిన హింస హేమంత్ సోరేన్ ప్రభుత్వ వైఫల్యం. ఇంత పెద్ద సంఘటన హఠాత్తుగా జరిగిందా? ప్రభుత్వం ముందుగానే అవసరమైన సూచనలు చేసి, పాలనా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసి ఉంటే ఆందోళనకారుల ఆటలు సాగేవి కావు. కాల్పులు జరపడంలో అర్థం లేదు. ఆ రోజు నేను రాంచీలో లేను. కానీ నాకు అందిన సమాచారం ప్రకారం, నేను చూసిన ఫుటేజీని బట్టి సంఘటనా స్థలంలో పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని అర్ధమవుతోంది. అక్కడ హిందువులు నిరసన వ్యక్తం చేయలేదు. అలాంటప్పుడు ముస్లింలు ఎందుకు అంత ఆవేశానికి లోనయ్యారన్నది పెద్ద ప్రశ్న" అని ఆయన అన్నారు.

"ఇది ప్రభుత్వం ప్రేరేపించిన హింస అని భావిస్తున్నాను. ముఖ్యమంత్రి, ఆయన సన్నిహితులపై ఈడీ తీసుకున్న చర్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వమే కావాలని ఇదంతా చేస్తోంది. ఆ హింసాత్మక ప్రదర్శనకు నాయకత్వం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలి" అని అన్నారు.

ప్రభుత్వ దర్యాప్తు

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సీనియర్ అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జార్ఖండ్ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ తెలిపారు. వారు ఏడు రోజుల్లో తమ నివేదికను సమర్పిస్తారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "ఏ ప్రభుత్వమైనా విచారణ చేయకుండా నిర్ణయమెలా తీసుకుంటుంది. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదొక విచారకరమైన సంఘటన. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. రాష్ట్రంలోని శాంతియుత వాతావరణాన్ని పాడుచేసేందుకు ఏ సంస్థలూ ప్రయత్నించకూడదు" అని అన్నారు.

పోలీసు

పోలీసులపై హత్యారోపణలు

ఈ హింసాకాండలో మరణించిన ముదాసిర్ తండ్రి పర్వేజ్ ఆలం తన కొడుకును హత్య చేశారని ఫిర్యాదు చేస్తూ, ఆ ఫిర్యాదులో కొంత మంది పోలీసుల పేర్లు రాశారు. ఈ ఫిర్యాదు కాపీ బీబీసీ దగ్గర ఉంది.

రోడ్డుపై ఉన్న పోలీసులు కాల్పులు జరిపారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు. ర్యాలీలో పాల్గొన్నవారు కూడా రాళ్లు విసరడం మొదలుపెట్టారు. దీంతో తొక్కిసలాట జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ranchi Violence: How did the violence start in Ranchi? Why did the police open fire
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X