జమ్మూ కాశ్మీర్ లో పోటెత్తిన ఓటర్లు-గత 7 ఎన్నికల్లో ఇదే రికార్డు..!
జమ్మూ కశ్మీర్ లో పదేళ్ల తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చురుగ్గా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మారిన పరిస్దితుల ప్రభావమో, పెరిగిన రాజకీయ చైతన్యమో, మరే ఇతర కారణమో తెలియదు కానీ తొలి దశ పోలింగ్ లో మాత్రం భారీగా ఓటర్లు పాల్గొన్నారు. దీంతో నిన్న జరిగిన పోలింగ్ లో గత ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది.
జమ్మూకశ్మీర్ లోని 24 సీట్లకు జరిగిన తొలి దశ పోలింగ్ లో ఏకంగా 61 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ ప్రకటించింది. గతంలో 50 శాతం చేరుకోవడమే కష్టంగా ఉన్న పరిస్దితుల నుంచి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 60 శాతం పైగా పోలింగ్ నమోదు కావడంతో ఈసీతో పాటు రాజకీయ పార్టీలు కూడా దీనిపై చర్చించుకుంటున్నాయి. నిన్న జరిగిన ఎన్నికల్లో ఇందర్ వాల్ నియోజకవర్గంలో అయితే ఏకంగా 82 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం.

తొలి దశ ఎన్నికల్లో మొత్తం 23 లక్షల ఓటర్లు 219 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. దీంతో భారీగా పెరిగిన ఓటింగ్ శాతం ఎవరిని ముంచబోతోందన్న చర్చ మొదలైంది. తొలి దశ ఓటింగ్ జరిగిన నియోజకవర్గాల్లో పలు చోట్ల ద్విముఖ, త్రిిముఖ పోరు కూడా జరిగింది. ఈ నెల 25న రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అలాగే అక్టోబర్ 1న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. దీంతో జమ్మూకశ్మీర్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.












Click it and Unblock the Notifications