
ఎయిర్‌టెల్, వొడాఫొన్ ఐడియాపై జియో సంచలన ఆరోపణలు, ఎంఎన్పీ కోసం రైతుల పేరుతో..ఎయిర్ టెల్, వొడాఫొన్ ఐడియాపై జియో
ఎయిర్ టెల్, వొడాఫొన్ ఐడియాపై జియో సంచలన ఆరోపణలు చేసింది. ఆ రెండు కంపెనీలు మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి అనైతికంగా పాల్పడుతున్నాయని తెలిపింది. ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్)కు జియో ఇన్ఫోకామ్ లేఖ రాసింది. వాటిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరింది. ఉత్తర భారతదేశంలో జరుగుతోన్న రైతుల ఉద్యమంలో ఈ రెండు సంస్థలు అనైతికంగా ఎంఎన్‌పీకి పాల్పడుతున్నాయని రిలయన్ జియో ఆరోపించింది.
ఎయిర్‌టెల్, వీఐఎల్ ఉద్యోగులు, ఏజెంట్లు, రిటైలర్ల ద్వారా ఈ పని చేస్తున్నాయని లేఖలో జియో ఆరోపించింది. జియో నుంచి తమ నెట్‌వర్క్‌లోకి మారడం అంటే రైతులకు మద్దతు పలకడమే అని అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నాయని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా లేఖకు జతచేయడం విశేషం. జియో ఆరోపణలపై భారతీ ఎయిర్‌టెల్ స్పందించింది.

గత 25 ఏళ్లుగా టెలికాం రంగంలో ఉన్నామని తెలిపింది. మార్కెట్‌లో తీవ్ర పోటీ ఎదుర్కొన్నామని.. వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది. తమ పోటీదారులను, భాగస్వాములను గౌరవిస్తున్నామని పేర్కొంది. పోటీదారులు మాత్రం నిరాధార ఆరోపణలు చేస్తారని, బెదిరింపు వ్యూహాలు రచిస్తారని తమకు తెలుసని చెప్పడం విశేషం. అయినప్పటికీ తాము పారదర్శకంగా వ్యాపారం చేస్తామని.. ఇందులో సందేహానికి తావులేదని చెప్పింది. ఇందుకు తాము గర్వపడుతున్నామని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది.