జయలలితకు షాక్, బెయిల్‌కు కోర్టు నిరాకరణ, ట్విస్ట్!
బెంగళూరు: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ పైన మంగళవారం విచారణ జరిగింది. కర్నాటక హైకోర్టులో జయలలితకు చుక్కెదురయింది. హైకోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, మొదట ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసినట్లుగా అందరు భావించారు. కానీ, ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలాని వాదించారు.
కాగా, జయలలితకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు ప్రాసిక్యూషన్ అభ్యంతరం చెప్పలేదు. ప్రాసిక్యూషన్ అభ్యంతరం చెప్పక పోవడంతో జయకు బెయిల్ వచ్చినట్లుగానే అన్నాడీఎంకే క్యాడర్‌తో పాటు అందరు భావించారు. ప్రాసిక్యూషన్‌తో హైకోర్టు ఏకీభవించలేదు. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. జయకు శిక్షను రద్దు చేసేందుకు ఎలాంటి ఆధారం లేదని కోర్టు పేర్కొంది.

కాగా, మంగళవారం ఉదయం కర్నాటక హైకోర్టులో జయలలిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పైన ఆమె తరఫున రాంజెఠ్మలానీ తన వాదనలను ముగించారు. అనంతరం శశికళ తరఫున ఆమె న్యాయవాది వాదిస్తూ.. జయలలిత నుండి శశికళ లబ్ధి పొందినట్లు ఆధారాలు లేవన్నారు. కేవలం అనుమానంతోనే శశికళ పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.
అంతకుముందు జయలలిత బెయిల్ పిటిషన్ పైన విచారణ నేపథ్యంలో బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హోసూరు రోడ్డులో జయ మద్దతుదారుల వేలాదిగా చేరారు. తమిళనాడు నుండి వచ్చిన బస్సులను కర్నాటక పోలీసులు హక్కిబెళి వద్ద తనిఖీలు చేసి అపేశారు.












Click it and Unblock the Notifications