ఈ అమ్మాయే ఆ ఆటంబాంబ్- బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదండోయ్.. !!
విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ముంబైలో శివాజీ పార్క్ వద్ద ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. నిరసనకారులను తరలించడానికి వచ్చిన ముంబై పోలీసుల వ్యాన్ ను ఓ అమ్మాయి అడ్డుకుంది. తన కుడిచేతిని ఆ వాహనం ముందుభాగంపై నిల్చున్న ఫొటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఒంటరిగా ఆ వ్యాన్ ను అడ్డుకున్న ఆ ధీరవనితపై సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ప్రశంసలు వచ్చిపడ్డాయి. ఆమె ఎవరనే విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
దీనికి సమాధానం లభించింది. ఆమె మరెవరో కాదు.. ముంబైకి చెందిన టాప్ మోడల్, నటి.. రియా అహిర్. యంగ్ ఎంటర్ ప్రెన్యుర్, హోస్ట్ కూడా. తన పేరు కలిసి వచ్చేలా రియాసత్ అనే లగ్జరీ దుస్తుల బ్రాండింగ్ ను నడిపిస్తోన్నారు. రియా ఎకౌసియా అనే ఆమె ఇన్ స్టా అకౌంట్ కు లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. అనేక మ్యూజిక్ వీడియోల్లో మెరిశారు. పలు యాడ్స్ లల్లో ఆమె నటించారు.

పోలీసుల వ్యాన్ ను అడ్డుకోవడంపై ఆమె ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీని వెనుక గల కారణాలను వెల్లడించారు. పోలీసుల వ్యాన్ ను అడ్డుకున్నప్పుడు మనసులో ఎలాంటి భయాందోళనలు లేవని, చుట్టూ ఉన్న విషయాల గురించి కూడా ఆలోచించలేదని అన్నారు. ఆ ఉద్విగ్న క్షణంలో పోలీసు వ్యాన్ లోపల ఉన్న విద్యార్థుల గురించి మాత్రమే తాను ఆలోచించానని వివరించారు.
ఓ బాధ్యతాయుతమైన పౌరురాలిగా తానూ తన సమాజానికి, చుట్టూ ఉన్న ప్రజలకు మేలు చేయాలనే స్వచ్ఛమైన ఉద్దేశంతోనే అలా స్పందించాల్సి వచ్చిందని అన్నారు. అక్కడ ఉన్న వాళ్లు ఏమనుకుంటారు అనే సంకోచం లేకుండా ఆ సమయంలో తనకు తోచింది తాను చేశానని, అంతరాత్మ ప్రబోధానుసారంగా నడుచుకున్నానని రియా అహిర్ పేర్కొన్నారు. నిరసనల సమయంలో ముంబై పోలీసు యంత్రాంగం తన పట్ల ప్రదర్శించిన తీరును కూడా రియా ఈ సందర్భంగా కొనియాడారు.
వ్యాన్ ముందు తాను నిల్చున్నప్పుడు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఎంతో సహనంతో ప్రవర్తించారని చెప్పారు. వ్యాన్ కు అడ్డు తొలగాలని, తమ విధులకు ఆటంకం కలిగించవద్దని మర్యాదపూర్వకంగా అడిగారని అహిర్ పేర్కొన్నారు. తాను కూడా అంతే గౌరవంతో నడుచుకున్నట్లు వివరించారు. ఈ సంక్లిష్ట పరిణామాలలో తల్లిదండ్రులు తనకు పూర్తి మద్దతుగా నిలిచారని, వీడియో ఈ స్థాయిలో వైరల్ అవుతుందని తాను అస్సలు భావించలేదని నవ్వుతూ బదులిచ్చారు.
ఆ వీడియో వైరల్ అయిన తర్వాత కొంత భయాందోళనగా ఉందని వ్యాఖ్యానించారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసులన్నింటినీ కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తుపై బెంగతో చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వారి వేదన చూసి తనకు రెండు రోజులుగా కంటిమీద కునుకు కూడా పట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
#WATCH | Mumbai: On her viral video of standing before Mumbai police van during student protest at Mumbai's Shivaji Park on July 22, model Rhiya Ahir says, "I did not think about others in that moment, I just thought about the people in the van. There were cops in there and those… pic.twitter.com/FlSjErOAvO
— ANI (@ANI) July 24, 2026
ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ హక్కుల సాధన కోసం శాంతియుత నిరసనలు తెలియజేసే పౌరులను లేదా విద్యార్థులను ప్రభుత్వాలు శత్రువులుగా పరిగణించకూడదని రియా అహిర్ చెప్పారు. దేశ ప్రజలు ఎప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకులు కారని, వారితో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల గొంతును నొక్కేలా వ్యవహరించడం కంటే, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications