జార్ఖండ్ బీజేపీలో టికెట్ల చిచ్చు- కొత్త వారికి ప్రాధాన్యంపై సిట్టింగ్ ల రచ్చ..!
వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న జార్ఖండ్ లో బీజేపీ టికెట్ల కేటాయింపు వ్యవహారం చిచ్చు రేపుతోంది. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న కాషాయ పార్టీని సొంత పార్టీ నేతలే చికాకు పెడుతున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వడంపై సొంత పార్టీ సిట్టింగ్ లు, ఆశావహులు మండిపడుతున్నారు. బీజేపీ తాజాగా విడుదల చేసిన టికెట్ల జాబితా వివాదానికి కారణమైంది.
తాజాగా బీజేపీలోకి అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు చేరారు. వీరందరికీ టికెట్లు దక్కాయి. ఇందులో మాజీ సీఎం చంపై సోరెన్ తో పాటు ఆయన కుమారుడు బాబూలాల్ సోరెన్, లోబిన్ హెంబ్రోమ్, గంగా నారాయణ్, మంజూదేవి, గీత కోరా, సీతా సోరెన్, రామచంద్ర వంశీ తదితర నేతలు ఉన్నారు. వీరందరికీ బీజేపీ టికెట్లు కేటాయించడంతో ఆయా సీట్లలో టికెట్లు ఆశించిన వారంతా ఇప్పుడు నిరాశలో ఉన్నారు.

జార్ఖండ్ అసెంబ్లీకి వచ్చే నెల 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీకి జరుగుతున్న ఈ ఎన్నికల్లో అధికార ఇండియా కూటమికీ, విపక్ష ఎన్డీయే కూటమికీ మధ్య గట్టి పోరు జరుగుతోంది. ఇలాంటి సమయంలో అధికార కూటమిలో పార్టీలకు చెందిన నేతల్ని లాక్కోవడం ద్వారా ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ కోరుకుంటోంది. అదే సమయంలో సొంత పార్టీలో ఎదురవుతున్న అసంతృప్తిని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications