వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిషి సునాక్: భారత సంతతి వ్యక్తిని ప్రధానిగా అంగీకరించేందుకు బ్రిటన్ సిద్ధంగా ఉందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రిషి సునాక్

నలభై యాభై ఏళ్ల క్రితం బ్రిటన్‌లో భారత సంతతి వ్యక్తులపై చాలా వివక్ష ఉండేది. ఏదో ఒకరోజు భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధాని అవుతారని ఎవరూ కలలో కూడా ఊహించుకునేవారు కాదు.

ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర వర్మకు 75ఏళ్లు. 55 ఏళ్ల క్రితం భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం నుంచి ఆయన లండన్‌కు వచ్చారు.

నల్లజాతీయులపై ఇక్కడ చాలా వివక్ష ఉండేదని బీబీసీతో వీరేంద్ర చెప్పారు. ''60లలో బ్రిటన్‌లో ఇళ్లు అద్దెకు ఇస్తామని బోర్డులు పెట్టేవారు. కానీ, నల్లజాతీయులు, ఆసియా ప్రజలకు ఆ ఇళ్లు ఇచ్చేవారు కాదు. క్లబ్‌ల బయట కూడా.. శునకాలు, నల్లజాతీయులు, ఐర్లాండ్ ప్రజలు, వలసదారులకు ప్రవేశంలేదని బోర్డులు పెట్టేవారు’’అని ఆయన వివరించారు.

వీరేంద్ర వర్మ

''భారతీయులను బ్రిటిష్ పౌరులు చూసినప్పుడు.. వారు ఒకప్పుడు మా బానిసలు, కానీ, ఇప్పుడు మాతో కలిసి కూర్చుంటున్నారని అనేవారు’’అని చెప్పారు.

అయితే, నేడు వీరేంద్ర శర్మ లాంటి చాలా మంది భారత సంతతి ప్రజలు ఎంపీలుగా ఎన్నికవుతున్నారు. మరోవైపు బోరిస్ జాన్సన్ క్యాబినెట్‌లోనూ భారత సంతతికి చెందిన మంత్రులు ఉన్నారు.

బ్రిటన్

నేడు ప్రధాని పదవికి..

ప్రస్తుతం అలాంటి భారత సంతతి వ్యక్తుల్లో ఒకరు బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీపడుతున్నారు. ఆయన పేరు రిషి సునాక్. ఆర్థిక మంత్రిగా, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఆయన సుపరిచితులు. ఆయనతోపాటు ప్రధాని పదవికి లిజ్ ట్రస్ పోటీ చేస్తున్నారు.

42ఏళ్ల రిషి సునాక్‌కు కన్జర్వేటివ్ పార్టీలో మంచి పేరుంది. తర్వాత ప్రధాన మంత్రి కాబోయే వారిని పార్టీలోని 1,60,000 మంది సభ్యులు సెప్టెంబరు 5న ఎన్నుకోబోతున్నారు.

అయితే, తర్వాత ప్రధాన మంత్రి భారత సంతతి వ్యక్తి అవుతారా? ఇక్కడి సమాజం దీన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉందా?

ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు దేశంలోని చాలా నగరాల ప్రజలతో మాట్లాడాం. దీనిపై వారి నుంచి అభిప్రాయాలు సేకరించాం.

కన్జర్వేటివ్ పార్టీ

''రిషి చాలా బెటర్’’

లండన్‌కు దాదాపు వంద కి.మీ. దూరంలో చెల్ట్‌న్హమ్ నగరం ఉంటుంది.

కన్జర్వేటివ్ పార్టీ కంచుకోటల్లో ఇది కూడా ఒకటి. అయితే, లండన్, బర్మింగర్హమ్, లివర్‌పూల్ లాంటి పెద్ద నగరాలను మినహాయిస్తే, చిన్నచిన్న పట్టణాల్లో భిన్నత్వం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఈ పట్టణాల్లో ఎక్కువగా శ్వేత జాతీయులు మాత్రమే ఉంటారు.

రిషి సునాక్ గురించి మీరు ఏమని అనుకుంటున్నారు? అని చెల్ట్‌న్హమ్‌లో కొందరు యువతను ప్రశ్నించాం. ''రిషి సునాక్ ఉంటే ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. ఆయన ఒక మంచి ఆర్థికవేత్త. ఆయన మంచి ప్రధానిగా కూడా సేవలు అందించగలరు’’అని ఒక యువతి అభిప్రాయం వ్యక్తంచేశారు.

అయితే, ఆమెతోపాటు స్థానిక కాలేజీలో చదువుకుంటున్న మరో అమ్మాయి కాస్త భిన్నంగా స్పందించారు. ''రిషి విధానాలు ఆయన లాంటి డబ్బున్న వ్యక్తులకే ఉపయోగపడతాయి. అందుకే నేను ఆయనకు మద్దతు పలకను’’అని అన్నారు.

శ్వేతజాతేతర వ్యక్తిని ప్రధాన మంత్రిగా స్వీకరించేందుకు బ్రిటిష్ సమాజం సిద్ధంగా ఉందా? అని ప్రశ్నించినప్పుడు.. ''నాకు తెలిసి ఇందులో వ్యక్తిగతంగా ఎవరికీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తంకాకపోవచ్చు. అందరూ దీనికి సిద్ధంగానే ఉన్నారు. నేనైతే రిషికే మద్దతు పలుకుతున్నాను’’అని ఒక మహిళ సమాధానం ఇచ్చారు.

ఇదే ప్రశ్నను మార్కెట్‌లో ఒక వ్యక్తిని కూడా అడిగాం. ''నేనైతే సిద్ధంగా ఉన్నాను. మిగతావారి సంగతి నాకు తెలియదు. దీని వల్ల అందరికీ మేలే జరుగుతుంది’’అని ఆయన చెప్పారు.

బర్మింగ్హమ్

బర్మింగ్హమ్.. బ్రిటన్‌లో రెండో అతిపెద్ద నగరం. ఇక్కడి ప్రజల్లో భిన్నత్వం కనిపిస్తుంది. ఇటీవల ఇక్కడ నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్ వేడుకల్లోనూ భిన్నత్వం కనిపించింది.

ఇక్కడ పాకిస్తాన్ సంతతికి చెందిన ప్రజలు కూడా ఎక్కువగానే ఉంటారు. హిందువైన రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీచేయడాన్ని వారు ఎలా చూస్తున్నారు?

శుక్రవారం పార్థనల అనంతరం మసీదు నుంచి బయటకు వస్తున్న ఒక వ్యక్తి ఈ ప్రశ్నపై మాట్లాడారు. ''దేశంలో ప్రజలు చాలా తెలివైనవారు. ఎవరు బాగా పనిచేస్తే వారినే ఎన్నుకుంటారు. ఇక్కడ జాతి, రంగులకు ఎలాంటి ప్రాధాన్యమూ లేదు. రిషి.. మెరుగ్గా సేవలు అందిస్తారని నేను నమ్ముతున్నాను. ఆయన మంచి ప్రధాని కాగలరు’’అని ఆయన చెప్పారు.

రిషి సునాక్

ఆ తర్వాత మరింత మంది మాట్లాడేందుకు ముందుకు వచ్చారు. గడ్డంతో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ.. ''మైనారిటీ వర్గానికి చెందిన రిషి.. ప్రధాని పదవికి సరైనవారు’’అని వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని మీర్‌పుర్ పట్టణానికి చెందిన మరో వ్యక్తి మాట్లాడుతూ.. ''రిషి తప్పకుండా ప్రధాన మంత్రి కావాలి. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా శ్వేతజాతీయులు మాత్రమే ప్రధాన మంత్రి అవుతున్నారు. ఇప్పుడు భారత సంతతికి చెందిన వ్యక్తి ఈ పదవిని చేపడితే, చాలా మార్పులు కనిపించొచ్చు’’అని అన్నారు.

రిషి సునాక్, లిజ్ ట్రస్

భగవద్గీతపై ప్రమాణం

రిషి సునాక్ హిందూ మతాన్ని అనుసరిస్తారు. 2015లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత భగవద్గీతపై ఆయన ప్రమాణంచేసి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ భారత సంతతి ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

అయితే, ఆయన్ను ప్రధాన మంత్రిగా చూడాలని ఎంతమంది అనుకుంటున్నారో త్వరలో తెలుస్తుంది.

1980 మే 12న సౌథంప్టన్‌లో రిషి సునాక్ జన్మించారు. తల్లిదండ్రులతోపాటు ఆయన ఇక్కడే ఉండేవారు. ఆయన తండ్రి వైద్యులు. తల్లి మందుల షాపు నడిపేవారు. తూర్పు ఆఫ్రికా నుంచి బ్రిటన్‌కు వలసవచ్చిన వీరు సౌథంప్టన్‌లో స్థిరపడ్డారు. వీరు ఇంటికి సమీపంలోని హిందూ దేవాలయానికి తరచూ వెళ్తుంటారు.

నరేశ్ సోన్‌చాటలా

మేం ఆ గుడికి వెళ్లినప్పుడు, అక్కడ 75ఏళ్ల నరేశ్ సోన్‌చాటలా కనిపించారు. ఆయనకు చిన్నప్పటి నుంచి రిషి సునాక్ తెలుసు. రిషి గురించి ఆయనతో మాట్లాడినప్పుడు.. ''ఆయన ప్రధాన మంత్రి అవుతారు. ఒకవేళ ఆయన ప్రధాన మంత్రి కాకపోతే.. దానికి ఆయన రంగు కారణం కావొచ్చు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ గుడికి అధిపతిగా సంజయ్ చంద్‌రాణా కొనసాగుతున్నారు. రిషి విషయంలో ఎలాంటి వివక్షా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ''ఈ దేశంలో మంచి విధానాలు, వ్యక్తిత్వాలకే ప్రాధాన్యం ఇస్తారు. రంగు, జాతీ ఇక్కడ పనిచేయవు’’అని ఆయన అన్నారు.

ఇక్కడ లిజ్ కంటే రిషికి ఎక్కువ ప్రజాదరణ ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అనేది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులే నిర్ణయిస్తారు. పార్టీలో యువత ఎక్కువగా రిషి వైపు మొగ్గు చూపుతుంటే, సీనియర్లు మాత్రం లిజ్ వైపు ఉన్నట్లు కనిపిస్తున్నారు.

రిషి సునాక్

ఈ ఇద్దరు నాయకుల మధ్య పార్టీ చర్చలను ఏర్పాటుచేస్తోంది. భిన్న అంశాలపై వీటిలో ఇద్దరూ పోటాపోటీగా మాట్లాడుతున్నారు.

ముందస్తు ఫలితాలు.. లిజ్‌కు అవకాశం ఉండొచ్చని చెబుతున్నాయి. కానీ, చర్చలు, కార్యక్రమాల్లో ఎక్కువ మంది రిషి సునాక్‌కు మద్దతు తెలుపుతున్నారు. లిజ్ ప్రచార బృందంతో పోల్చినప్పుడు రిషి బృందం మెరుగ్గా పనిచేస్తోందని చెప్పొచ్చు. దీనిలో ఎక్కువ మంది యువత కనిపిస్తున్నారు.

రిచర్డ్ గ్రాహమ్.. గ్లౌసెస్టర్ నియోజకవర్గం నుంచి కన్జర్వేటివ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఇప్పటికే రిషికి మద్దతు ప్రకటించారు. రిషిని ప్రజలు ఇష్టపడుతున్నారా? అని మేం ఆయన్ను ప్రశ్నించాం. ''అయితే, ఎన్నికల ఫలితాల రోజే ఈ విషయం తెలుస్తుంది. దేశాన్ని రిషి కచ్చితంగా ముందుకు తీసుకెళ్లరని మేం భావిస్తున్నాం. అయితే, ఇక్కడ రంగు, జాతులతో ఎలాంటి సంబంధమూ లేదు’’అని ఆయన చెప్పారు.

మర్సియా జకో

వివక్షపై రిషి ప్రచార బృందంలో ఒక సభ్యుడు మాతో మాట్లాడారు. ''అసలు దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. విధానాల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది’’అని అన్నారు.

మరోవైపు రిషి నేపథ్యం సమస్యగా మారుతుందని తాము భావించడంలేదని మరో సభ్యుడు వివరించారు. ''చేసిన పనుల ఆధారంగానే మనుషులను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. నేపథ్యాన్ని ఎవరు పట్టించుకుంటారు? కరోనావైరస్ వ్యాపించిన సమయంలో రిషి మంచి విధానాలను ప్రవేశపెట్టారు. లక్షల సంఖ్యలో చిన్న పరిశ్రమలకు ఆర్థిక సాయం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా చర్యలు తీసుకున్నారు’’అని చెప్పారు.

లిజ్ ట్రస్‌కు కూడా గట్టిగానే మద్దతు

మరోవైపు లిజ్ ట్రస్‌కు కూడా గట్టిగానే మద్దతు కనిపిస్తోంది. ''అసలైన కన్జర్వేటిజం అంటే ఏమిటో లిజ్ చెబుతున్నారు. ఈ దేశానికి ఇప్పుడు అదే కావాలి. రిషికి చాలా మందితో మంచి సంబంధాలు లేవు. ఇక్కడ ఆయన నేపథ్యంతో ఎలాంటి సంబంధమూ లేదు. 2010 నుంచి ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు నల్లజాతీయులను వేరేగా ఎవరూ చూడటం లేదు’’అని లిజ్ ప్రచార బృందంలో ఒక సభ్యుడు చెప్పారు.

రిషి.. తనని తాను హిందువునని, భారతీయ సంతతి వ్యక్తినని పరిచయం చేసుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు? అని టీచర్‌గా పనిచేసిన మర్సియా జకోను ప్రశ్నించాం. ''ఇప్పుడు నేపథ్యాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. నా భర్త కూడా బ్రిటన్‌లో పుట్టలేదు. అసలు దాని గురించి నేనేం పట్టించుకోను. కానీ, నా విషయంలో మంచి ప్రధాని అంటే లిజ్ మాత్రమే’’అని ఆమె అన్నారు.

గత జులైలో బోరిస్ జాన్సన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత, ఎనిమిది మంది అభ్యర్థులు ఈ పదవి కోసం బరిలో నిలిచారు. ఇప్పుడు ఈ పోటీ తుది దశకు చేరుకుంది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులంతా కలిసి.. రిషి లేదా లిజ్‌లలో ఒకరిని ఎన్నుకోబోతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తంగా లక్షా 60 వేల మంది పార్టీ సభ్యులు పాలుపంచుకుంటారు.

శ్వేతజాతేతరులు ప్రధాన పదవికి పోటీ చేయడంపై మిడిలెక్ యూనివర్సిటీకి చెంది డాక్టర్ నీలమ్ రైనా మాట్లాడుతూ.. ''ఆ తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. మనలో ఆ సామర్థ్యం, ఆశ ఉంటే మనం కూడా పోటీ చేయొచ్చు. ఇప్పుడు ఆ తలుపు ధనవంతుడైన భారత సంతతి వ్యక్తి రిషి కోసం తెరచుకుంది’’అని అన్నారు.

ఒకవేళ రిషి.. బ్రిటన్ ప్రధాని అయితే, అది చరిత్రాత్మకం అవుతుంది. 2008లో ఇలానే అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చరిత్ర సృష్టించారు. రిషి విజయంపై పార్టీ నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇప్పుడు విజయం సాధించకపోయినా, తర్వాత ఎన్నికలు 2024లో జరుగబోతున్నాయి. అప్పుడు మరో అవకాశం ఆయనకు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Rishi Sunak: Is Britain ready to accept a person of Indian origin as Prime Minister?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X