Bihar Polls Survey: ఆ కూటమిదే బీహార్ ? ఇవే గేమ్ ఛేంజర్స్-తాజా సర్వే..!
వచ్చే నెలలో రెండు విడతల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి చూపూ నెలకొంది. దీనికి కారణం ఉత్తరాదిలో బీజేపీ దీర్ఘకాలంగా పట్టు నిలుపుకుంటున్న హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి. దీంతో ఈసారి బీజేపీ అక్కడ పట్టుకొనసాగిస్తుందా లేక మహాకూటమి గేమ్ ఛేంజ్ చేయబోతోందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇందుకు తగ్గట్టుగానే స్థానికంగా సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన ఓ సర్వే క్లారిటీ ఇచ్చేసింది.
బీహార్ ఎన్నికలపై ఓటరు నాడి ఎలా ఉందన్న అంశంపై ఓట్ వైబ్ అనే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో బీజేపీ-జేడీయూతో కూడిన ఎన్డీయే కూటమికీ, ఆర్జేడీ-కాంగ్రెస్ తో కూడిన మహాకూటమికీ మధ్య ఎంత హోరాహోరీ పోరు నెలకొందో అర్దమవుతోంది. అదే సమయంలో మహాకూటమి స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు సర్వే తేల్చింది. తాజా అంచనాల ప్రకారం మహాకూటమికి మద్దతుగా 34.7 శాతం మంది, ఎన్డీయేకు మద్దతుగా 34.4 శాతం మంది ఉన్నట్లు తేలింది. ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ కు 12.3 శాతం మంది మద్దతిస్తున్నారు. 10 శాతం ఎటూ తేల్చలేదు.

మరోవైపు ఈ సర్వేలో బీహార్ ప్రజల్లో మహాకూటమికి స్వల్ప ఆధిక్యం లభిస్తున్నప్పటికీ ఎన్డీయే పోటా పోటీగా ఉండటం వెనుక పలు కీలక కారణాలు వెల్లడయ్యాయి. ఇందులో ఛత్ పండుగ తర్వాత వలస వెళ్లిన కార్మికులు తిరిగి వచ్చి ఎన్నికల్లో ఓటు వేస్తారని అంచనా వేస్తున్నారు. వీరి ఓట్ల శాతం బీహార్ ఫలితాలకు కీలకంగా మారబోతోంది. 51 శాతం ఓటర్లు కులం కంటే పార్టీ చూసి ఓట్లు వేస్తామని చెప్పగా.. 27 శాతం మంది పార్టీ కంటే కులమే ముఖ్యమని తేల్చేశారు.

అలాగే తేజస్వీ యాదవ్ ఇచ్చిన ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం హామీ ఎన్డీయే ఇచ్చిన 10 వేల రూపాయల హామీ కంటే మెరుగ్గా ఉందని సర్వేలో పాల్గొన్న సగం మంది అభిప్రాయపడ్డారు. అటు జన్ సురాజ్ పార్టీకి ఓట్లు వేస్తామని చెప్పిన వారు 12.3 శాతం ఉన్నప్పటికీ 48 శాతం మంది ఆ పార్టీ గుర్తే తమకు తెలియదని చెప్పేశారు. దీంతో ప్రశాంత్ కిషోర్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని తేలిపోతోంది. మొత్తం మీద బీహార్ ఎన్నికలు ఏ పార్టీకి నల్లేరు మీద నడక కాదనేది ఈ సర్వే ఫలితాల సారాంశంగా ఉంది.












Click it and Unblock the Notifications