ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్‌లో రూ. 12,800 కోట్లు: వాటాలు ఇలా, కీలక ప్రాజెక్టులు
తెలుగు రాష్ట్రాలకు రైల్వే విభాగంలో కేటాయింపులపై ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరాలను వెల్లడించారు.
న్యూఢిల్లీ: ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలకు చెందిన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు బడ్జెట్‌లో కేటాయింపులు శూన్యమని బీఆర్ఎస్ మంత్రులు, నేతలు కేంద్రంపై మండిపడుతున్నారు. ఏపీలో కూడా తమకు న్యాయం జరగలేదని కేంద్ర బడ్జెట్‌పై అసంతృప్తి చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు రైల్వే విభాగంలో కేటాయింపులపై ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరాలను వెల్లడించారు.

రైల్వే నిధుల కేటాయింపుల్లో తెలంగాణ కంటే ఏపీకి డబుల్!
కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొత్తంగా రూ. 12,800 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో రూ. 4,418 కోట్లు తెలంగాణలోని ప్రాజెక్టులకు కాగా, ఏపీలోని ప్రాజెక్టుల కోసం రూ. 8,406 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 2009-2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ. 886 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.

రైల్వే స్టేషన్లలో రోజువారీ సరుకులు కూడా
బడ్జెట్‌లో తెలంగాణకు భారీగా కేటాయింపులు జరిగాయని, చాలా చోట్ల అండర్ పాస్‌లు, రైల్వే బ్రిడ్జీల నిర్మాణం జరుగుతోందని రైల్వే మంత్రి వైష్ణవ్ వివరించారు. వీటిలో డబ్లింగ్, ట్రిపులింగ్ చేసే ప్రాజెక్టులు కూడా ఉన్నాయన్నారు. రైల్వే స్టేషన్లలో రోజువారీ సరుకులు కూడా ప్రయాణికులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలుకు ప్రయాణికుల మంచి స్పందన వస్తోందని రైల్వే మంత్రి తెలిపారు.

కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై అశ్విని వైష్ణవ్
కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచామని, త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీలు ఇప్పటికే దేశంలో చాలా ఉన్నాయన్నారు. విభజన చట్టంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఫీజుబులిటీ పరిశీలించాల్సి ఉందన్నారు. తెలంగాణలో ఎంఎంటీఎస్ కోసం రూ. 600 కోట్లు కేటాయించామని తెలిపారు. కేంద్రం చేయాల్సింది చేస్తుందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని అశ్విని వైష్ణవ్ కోరారు.

రెండు పట్టణాల మధ్య వందే మెట్రోలు
త్వరలో వందే మెట్రోలు కూడా రాబోతున్నాయన్నారు. 60-70 కిలోమీటర్లు ఉన్న రెండు పట్టణాల మధ్య వందే మెట్రో నడుస్తుందని, వందే భారత్ రైలుకు ఇది భిన్నంగా ఉంటుందన్నారు. ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాతే వందే మెట్రోను ప్రవేశపెడతామని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2017లోనే ప్రధాని మోడీ వందే భారత్ రైలును సూచించారని, అనేకసార్లు పరీక్షించిన తర్వాతే వందే భారత్ రైళ్ల తయారీ ప్రారంభమైందని తెలిపారు. హైస్పీడ్ రైళ్లపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో రానున్న రోజుల్లో మరిన్ని వందే భారత్ రైళ్లు వస్తాయని కేంద్రమంత్రి వివరించారు. రైల్వే ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరుతున్నామని రైల్వే మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications