టీకి బిజెపి: తెర వెనక ఆర్ఎస్ఎస్, చంద్రబాబు కటీఫ్?
న్యూఢిల్లీ: బిజెపితో జత కట్టి తెలంగాణను అడ్డుకోవాలనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రయత్నాలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వల చెడిపోయినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు దగ్గరై, పొత్తుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. సీమాంధ్రలో ఎక్కువ లోకసభ సీట్లు గెలిపించి ఇస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లు చెబుతారు. దీంతో ఒక సమయంలో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని బిజెపి అగ్రనేతలు అనుకున్నట్లు చెబుతున్నారు.
అయితే, ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగి బిజెపికి మార్గదర్శకత్వం నెరిపినట్లు చెబుతున్నారు. తెలంగాణకు మద్దతు ఇవ్వాలని నాగపూర్ నుంచి బిజెపికి ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. ఇది మన పాత ఎజెండా అని, తెలంగాణకు మద్దతు ఇస్తే ఈ ప్రాంతంలో బిజెపి బలం పుంజుకుంటుందని, సీమాంధ్రలో సాధించేదాని కన్నా ఇది ఎక్కువగా ఉంటుందని ఆర్ఎస్ఎస్ పెద్దలు బిజెపి నేతలకు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగడంతో బిజెపి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ తెలంగాణ నేతల నుంచి కూడా బిజెపి అగ్రనేతలపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. తెలంగాణకు మద్దతుగా నిలిచిన బిజెపి తెలంగాణలో బలం పుంజుకుంది. తెలంగాణకు మద్దతు ఇవ్వడం వల్లనే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ శాసనసభకు గెలిచారు. అలాగే, మరో శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి పార్టీలో చేరారు.
ప్రస్తుత స్థితిలో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపించడం లేదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కోడెల శివప్రసాద్ వంటి టిడిపి సీనియర్ నాయకులు బిజెపిని కూడా నిందిస్తున్నారు. దీంతో సీమాంధ్రలో ఆ పార్టీల మధ్య పొత్తు కుదరకపోవచ్చునని అంటున్నారు. తెలంగాణలో పొత్తు ఉంటుందా అనేది కూడా అనుమానమే.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపితో పొత్తును కోరుకుంటున్నారు. కానీ బిజెపి తెలంగాణ నేతలు కోరుకోవడం లేదు. తెలంగాణలో చంద్రబాబుపై వ్యతిరేకత ఉందని వారు భావిస్తున్నారు. దీంతో టిడిపితో పొత్తుకు వారు అంగీకరించడం లేదని అంటున్నారు. అయితే, ఇంకా కొద్ది రోజులు పోతే తప్ప ఎవరేమిటనేది తెలియదు.












Click it and Unblock the Notifications