పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్ .. ఆగస్ట్ 9న నల్లబెల్లికి రాక!
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. సుదర్శన్ రెడ్డి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ నెల 9వ తేదీన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన స్వగ్రామానికి రానున్నారు.
నల్లబెల్లిలో పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్
నల్లబెల్లి లో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించనున్నారు. అదే రోజు నిర్వహించే సంస్మరణ సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఆపై ఈ నెల 10వ తేదీన హనుమకొండలో జరిగే సంస్కరణ సభకు హరీష్ రావు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఈ సంస్కరణ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ భవన్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలు పెద్ద ఎత్తున నిర్వహించేలా నిర్ణయం
తెలంగాణ ఉద్యమకారుడు అయిన పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలు పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ సహచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు అందరూ ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
పెద్ది మరణం పార్టీకి తీరని లోటు అన్న అభిప్రాయం
సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మరణం పార్టీలో తీవ్ర విషాదాన్ని కలిగించిందని, అది పార్టీకి తీరని లోటని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా, విశ్వాస పాత్రుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి కొనసాగారని, నర్సంపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే బలమైన ముద్ర వేస్తున్న నాయకుడిగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు.
కేసీఆర్ పర్యటన ఏర్పాట్లపై కేటీఆర్ తో చర్చ
ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈనెల 9వ తేదీన నల్లబెల్లికి రానున్న క్రమంలో ఏర్పాట్లపై కేటీఆర్ తో చర్చించారు. ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి పైన తనకున్న ప్రేమను వ్యక్తం చేసిన కేసీఆర్, ఆ కుటుంబానికి తండ్రిలా అండగా ఉంటానని ప్రకటన చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్నకు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కూడా ప్రకటన చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం స్వయంగా అధినేత.. పెద్దికి గొప్ప గౌరవం
పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్న అప్పులు తీరుస్తామని, పిల్లల చదువుల బాధ్యతలు తామే తీసుకుంటామని కెసిఆర్ పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలో మళ్లీ త్వరలో కేసీఆర్ స్వయంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడం కోసం వరంగల్ జిల్లాకు రావడం పార్టీలో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్న గౌరవాన్ని స్పష్టం చేస్తుంది.












Click it and Unblock the Notifications